 
					Sunbath Benefits: శీతాకాలం మొదలైందంటే చాలు.. చాలామంది బయటకి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. ఇంకొందరైతే చిన్నపాటి చలిని కూడా తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోవడం లేదా ఒంటిపై పెద్ద రగ్గు కప్పుకుని తిరగటమో చేస్తుంటారు. ఇలా చలి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ముఖ్యంగా శీతాకాలంలోనే మన శరీరానికి ‘సన్‌బాత్’ చాలా అవసరం. ఉదయం పూట కొంత సమయం సూర్యరశ్మిలో గడపటాన్నేవింటర్ సన్‌బాతింగ్ అంటారు. ఈ సీజన్‌లో మంచి ఆహారపు అలవాట్లతో పాటు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే.. వింటర్ సన్‌బాతింగ్ కూడా చాలా ముఖ్యం.
చలికాలంలో తీవ్రమైన పొగ, మంచు వల్ల మనం బయటికి వెళ్లకపోవడం వల్ల సూర్యరశ్మి మనమీద పడకపోవచ్చు. కాబట్టి.. ఉదయం పూట లేదా సాయంత్రం పూట సూర్యరశ్మి శరీరం మీద పడేలా చూసుకునే బాధ్యత మనదే. రోజులో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే.. శీతాకాలంలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. లేదంటే.. జలుబు, దగ్గు, తీవ్రమైన వణుకు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో సూర్యరశ్మి మన శరీరాన్ని తాకడం వల్ల వెచ్చగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది.
శీతాకాలంలో ప్రతిరోజూ ఉదయం పూట మన శరీరంపై పడే 10 నుంచి 15 నిమిషాల సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి సహజ వనరుగా అందుతుంది. దీని ద్వారా అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. విటమిన్ డి లోపం ఉన్నవారికి సూర్యరశ్మి అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు నిపుణులు. ఉదయం పూట దొరికే డి విటమిన్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.
చలికాలం మొదలైందంటే చాలు.. అనేక వ్యాధులు వచ్చి మనచుట్టూ చేరుతుంటాయి. చాలామందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. కాబట్టి.. ప్రస్తుత సీజన్‌లో సూర్యరశ్మిని నేరుగా ఆస్వాదించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వివిధ వ్యాధులతో పోరాడటానికి సాయం చేస్తాయి.
సాధారణంగా చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. సూర్య కిరణాలు మన శరీరంపై నేరుగా పడటం వల్ల చర్మం దెబ్బతింటుందని భావిస్తుంటారు. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే.. శీతాకాలం లభించే వెచ్చని సూర్యకాంతిలో కొంచెం సేపు కూర్చోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి.
శీతాకాలంలో చాలామంది వేగంగా బరువు పెరుగుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయం 15 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం వల్ల అధిక బరువును కంట్రోల్ చేయొచ్చు. ఇక వాకింగ్, రన్నింగ్, జాగింగ్, యోగా చేసే వారికి అనేక రకాల ప్రయోజనాలు అందుతుంది. సూర్యరశ్మి బరువు తగ్గడానికి సహజ మార్గమని, ఇది కేలరీల బర్నింగ్‌ను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి సన్‌బాత్ చాలా అవసరం. శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ప్రోత్సహించడానికి ఈ వింటర్ సన్‌బాతింగ్ ఎంతగానో మేలు చేస్తుంది. ఉదయం ఒక గంట సూర్యరశ్మి మీ నిద్రను మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.