 
					Seasonal Fruit In Winter: చలికాలం రాగానే మన శరీరానికి మరింత పోషణ, వెచ్చదనం, వ్యాధి నిరోధక శక్తి అవసరం అవుతుంది. ఈ సీజన్‌లో ప్రకృతి మనకు అందించే కాలానుగుణ పండ్లు ఆరోగ్యానికి గొప్ప వరంగా పనిచేస్తాయి. ఇవి చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. చలికాలంలో ఎక్కువగా లభించే అంతే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ప్రసిద్ధ పండ్లు, వాటి ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. సిట్రస్ పండ్లు ( నారింజ, బత్తాయి, నిమ్మ):
చలికాలంలో లభించే పండ్లలో సిట్రస్ పండ్లు ముఖ్యమైనవి.
నారింజ, బత్తాయి: ఈ పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ ‘సి’ శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు బారి నుంచిరక్షణ లభిస్తుంది.
ప్రయోజనాలు: ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
2. దానిమ్మ: 
దానిమ్మ గింజలు పోషకాల గని. శీతాకాలంలో దానిమ్మలు ఎక్కువగా లభిస్తాయి.
ప్రయోజనాలు: దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ‘సి’, విటమిన్ ‘కె’, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఐరన్ ఇతర పోషకాలు పిల్లలకు మంచి పోషణను అందించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
3. ద్రాక్ష:
శీతాకాలంలో నల్ల ద్రాక్ష, ఆకుపచ్చ ద్రాక్ష ఎక్కువగా మార్కెట్‌లో కనిపిస్తాయి.
ప్రయోజనాలు: ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు (ముఖ్యంగా రెస్వెరాట్రాల్), విటమిన్ ‘ఎ’, ‘బి2’, ‘బి1’ తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అంతే కాకుండా కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి.
4. జామకాయ:
జామకాయ ఈ సీజన్‌లో లభించే మరో అద్భుతమైన పండు.
ప్రయోజనాలు: జామకాయ విటమిన్ ‘సి’, ఫైబర్, మాంగనీస్‌లకు మంచి వనరు. దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు ఇది చాలా ఉపయోగ పడుతుంది.
5. ఖర్జూరం:
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఖర్జూరాలు అద్భుతమైన ఆహారం.
ప్రయోజనాలు: ఖర్జూరాలలో సహజ సిద్ధమైన చక్కెరలు, ఫైబర్ ,ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి ఇవి సహాయపడతాయి.
6. ఆపిల్:
“రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు” అనే సామెత తెలిసిందే. చలికాలంలో ఆపిల్స్ నాణ్యత బాగుంటుంది.
ప్రయోజనాలు: ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ ‘సి’, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కడుపు నిండుగా ఉంచి బరువు అదుపులో ఉండటానికి కూడా తోడ్పడతాయి.
కాలానుగుణంగా లభించే ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా.. రోగనిరోధక శక్తితో ఉంచుకోవచ్చు. పండ్ల రసాల కంటే పండ్లను నేరుగా తినడం వల్ల పూర్తి స్థాయిలో ఫైబర్ , పోషకాలు అందుతాయి.