Drinking Water: మనం బతకడానికి గాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. మన శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. అయితే.. చాలా మంది నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తాగేస్తుంటారు. కేవలం నీళ్లు తాగడం ముఖ్యం కాదు. వాటిని సరైన పద్ధతిలో తాగడం కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం.. తప్పుడు పద్ధతిలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ఈ కింది 4 పొరపాట్లు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి.
1. నిలబడి నీరు తాగడం:
చాలా మంది ఆత్రుతగా లేదా వేగంగా వెళ్తూ నిలబడి నీరు తాగుతుంటారు. ఇది అత్యంత సాధారణమైన కానీ ప్రమాదకరమైన పొరపాటు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు.. ఆ నీరు నేరుగా అన్నవాహిక ద్వారా వేగంగా కడుపులోకి వెళ్తుంది. దీ నివల్ల నీటిలోని పోషకాలు శరీరానికి అందవు. ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. అంతే కాకుండా వడపోత ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది ఆర్థరైటిస్ కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పుడూ కూర్చుని, ప్రశాంతంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి.
2. గటగటా తాగడం:
దాహం వేసినప్పుడు బాటిల్ ఎత్తి ఒకేసారి లీటరు నీటిని తాగేయడం చాలా మందికి అలవాటు. ఇది సరైన పద్ధతి కాదు. మన నోటిలోని లాలాజలం క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడానికి సహాయ పడుతుంది. మీరు వేగంగా నీరు తాగినప్పుడు లాలాజలం నీటితో కలవదు. దీని వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే నీటిని సిప్ చేస్తూ (చిన్న చిన్న గుక్కలతో), నోటిలో కాసేపు ఉంచుకుని తాగాలి.
3. భోజనానికి ముందు లేదా వెంటనే నీరు తాగడం:
భోజనం చేసేటప్పుడు మధ్యలో లేదా భోజనం ముగిసిన వెంటనే గ్లాసుల కొద్దీ నీరు తాగడం జీర్ణక్రియను నాశనం చేస్తుంది. మన శరీరం ఆహారాన్ని అరిగించడానికి ‘జఠరాగ్ని’ ని ఉపయోగిస్తుంది. భోజనం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఈ అగ్ని చల్లారిపోతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కుళ్ళిపోతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం , మలబద్ధకానికి దారితీస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 45-60 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. అవసరమైతే భోజనం మధ్యలో ఒకట్రెండు సిప్స్ తాగవచ్చు.
Also Read: గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 లైఫ్ స్టైల్ మార్పులతో హార్ట్ ఎటాక్‌కు చెక్
4. అతిగా చల్లటి నీరు తాగడం:
ఎండకాలంలో లేదా వ్యాయామం చేసిన తర్వాత ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగడం హాయిగా అనిపించవచ్చు. కానీ అది శరీరానికి హానికరం. ఎక్కువగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇది జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గడ్డకడుతుంది. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. అలాగే గొంతు నొప్పి, గుండె వేగం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందకే ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని లేదా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.
నీరు మనకు ప్రాణాధారం. కానీ దానిని ఔషధంలా వాడాలి. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ జీర్ణశక్తిని మెరుగు పరుచుకోవడమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. గుర్తుంచుకోండి. ఆరోగ్యకరమైన అలవాటే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది.