స్వీట్ తినాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ప్రతిసారీ బయటకు వెళ్లి కొనుక్కోవాలంటే కష్టం. మేము ఇక్కడ చాలా సింపుల్‌గా అయిపోయే బేసన్ హల్వా రెసిపీ ఇచ్చాము. ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. ఎంత సులువో అర్థం అయిపోతుంది. కేవలం పావుగంటలో మీరు దీన్ని ఉండొచ్చు .దీనిలో నెయ్యి కూడా ఉంటుంది, కాబట్టి రుచి అదిరిపోతుంది. గుప్పెడు డ్రైఫ్రూట్స్ కూడా తరిగి వేసుకుంటే బలం కూడా అందిస్తుంది. ఈ బేసన్ హల్వా ఒక్క రోజు చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజులు తాజాగా ఉంటుంది. దీంట్లో నెయ్యి అధికంగా వేస్తాం, కాబట్టి హల్వా త్వరగా పాడవదు. ఇక హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బేసన్ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
శనగపిండి – ఒక కప్పు
నెయ్యి – ముప్పావు కప్పు
పంచదార – అర కప్పు
బొంబాయి రవ్వ – రెండు స్పూన్లు
వేడి నీరు – ఒక కప్పు
యాలకుల పొడి – పావు స్పూను
బాదం తరుగు – అరకప్పు
బేసన్ హల్వా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
2. నెయ్యి వేడెక్కాక శెనగపిండిని జల్లించి అందులో వేసి ఒకసారి వేయించండి.
3. చిన్న మంట మీద వేయిస్తే అది మాడిపోకుండా ఉంటుంది.4. ఇప్పుడు పంచదారను కూడా వేసి బాగా కలపండి.
5. పంచదార కరిగి పాకంలాగా అవుతుంది. అలాగే అందులో బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలపండి.
6. ఆ తర్వాత వేడి నీటిని పోసి బాగా కలుపుతూ ఉండాలి.
7. అది నీరు పీల్చుకొని దగ్గరగా మందంగా అవుతుంది.
8. అప్పుడు యాలకుల పొడి, బాదం తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఆ సమయంలో రెండు మూడు స్పూన్లు నెయ్యిని కూడా వేస్తే మంచిది.
10. ఘుమఘుమలాడుతూ హల్వా రెడీ అయిపోతుంది.
11. స్టవ్ కట్టేసి ఇది కాస్త చల్లబడే వరకు ఆగండి.
12. ఆ తర్వాత తిని చూడండి. బేసన్ హల్వా రుచి టేస్టీగా ఉంటుంది. తినాలన్న కోరిక పెరుగుతుంది.
ఇందులో మనం వాడేది ప్రధానంగా శెనగపిండి. శెనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఈ బేసన్ హల్వాలో మనం పంచదారను అధికంగా వేసాము. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తినకపోవడమే మంచిది. అయితే శెనగపిండిలో ఎలాంటి గ్లూటెన్ ఉండదు.
శెనగపిండితో చేసిన వంటలు తినడం వల్ల ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి. దీన్ని తినడం మీరు బరువు పెరగరు. గోధుమల కంటే శనగపిండిని తినడమే డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మంచిది. శెనగపిండితో చేసిన వంటకాలు తరచూ తినడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు శెనగపిండితో చేసిన వంటకాలు తక్కువగా తింటేనే మంచిది.
Also Read: సొరకాయ చపాతి ఇలా చేశారంటే, దూది కంటే మెత్తగా వస్తుంది
దీనిలో ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ లో ఉన్నవారు తరుచూ శెనగపిండితో చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. అయితే ప్రతిరోజు శెనగపిండిని తింటే మాత్రం కడుపుబ్బరం సమస్య వస్తుంది. అప్పుడప్పుడు తినేందుకే ప్రయత్నించాలి.