AP Murder Case: ఎక్కడైనా పెళ్ళిపత్రిక ఇస్తే బంధువులు వస్తారు. సందడి సందడిగా అటు ఇటు తిరుగుతూ.. పెళ్లిలో అంతా హడావుడి చేస్తారు. కానీ ఇక్కడ పెళ్లిపత్రిక ఇస్తే పోలీసులు వచ్చారు. నేరుగా అరెస్ట్ చేశారు. ఇంతకు అతని అరెస్ట్ కు ఒక కారణంగా ఆ పెళ్ళిపత్రికే కావడం విశేషం. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అంటుంటారు. అదే నిజమైంది ఇక్కడ. ఆ ఒక్క పత్రికతో 26 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అంటే మనోడు 26 ఏళ్లుగా చిక్కడు.. దొరకడులా ఉన్నాడన్న మాట.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నేహట్టిలో ఈ ఘటన జరిగింది. దిన్నేహట్టికి చెందిన తిప్పేస్వామి 1998 అక్టోబర్ 2న తన సొంత కుమారుడినే, గొంతు నులిమి చంపి గోతిలో పూడ్చి పరారయ్యాడు. ఈ హత్యకు కారణం తనకు భార్యపై ఉన్న అనుమానమేనని పోలీసులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు అప్పట్లోనే తిప్పేస్వామి పై భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి నుండి తిప్పేస్వామి పరారీ కావడంతో, పోలీసులు గాలింపు చేపట్టి మిన్నకుండి పోయారు.
ఇక్కడే తిప్పేస్వామి పాపం పండింది. కొడుకును హత్య చేసిన తరువాత తిప్పేస్వామి కర్ణాటకకు పరారయ్యాడు. అక్కడ కృష్ణగౌడ్ గా పేరు మార్చుకొని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, ఓ కుమార్తెకు వివాహాన్ని నిశ్చయించాడు తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ్. ఆ పెళ్లిపత్రికను దిన్నేహట్టి లోని తన స్నేహితుడు నాగరాజుకు పంపాడు స్వామి.
ఇటీవల ఈ హత్య కేసును ఎలాగైనా ఛేదించాలని పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నాగరాజు ఇంటిని పోలీసులు సోదా చేశారు. ఆక్రమంలో వారికి పెళ్ళిపత్రిక కనిపించింది. ఇక అంతే పెళ్లిపత్రిక లో తిప్పేస్వామి ముఖచిత్రం చూసిన పోలీసులు, చేతిలో పత్రిక పట్టుకొని నేరుగా స్వామి ఇంటి వద్దకు వెళ్లారు. నేరుగా యువర్ అండ్ అరెస్ట్ అంటూ.. పోలీసులు చెప్పేసి తిప్పేస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
కొడుకును హత్య చేసి, కుమార్తెకు పెళ్లి చేస్తూ తిప్పేస్వామి 26 ఏళ్ల తర్వాత పోలీసులకు దొరకడంతో, ఎట్టకేలకు హత్య కేసు దర్యాప్తుకు ముగింపు పడింది. ఈ కేసును చేదించిన పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.
26 ఏళ్ల క్రితం నాటి హత్యను పట్టించిన పెళ్లి పత్రిక
కన్న కుమారుడి గొంతు నులిమి చంపేసి గోతిలో పాతిపెట్టిన కసాయి తండ్రి
భార్యపై అనుమానంతో 1998 అక్టోబర్ 2న కొడుకును హత్య చేసిన తిప్పేస్వామి
రెండో వివాహం చేసుకున్న తిప్పేస్వామికి ఇద్దరు కుమార్తెలు
ఇటీవలే ఓ కుమార్తెకు కుదిరిన వివాహం… pic.twitter.com/VyH7BFIAWB
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2024