BP Test: రక్తపోటు అనేది మన ఆరోగ్యాన్ని సూచించే ముఖ్యమైన కొలమానం. హైపర్ టెన్షన్ ఉన్నవారు తరచుగా.. బీపీ చెక్ చేసుకోవడం మంచిదే అయినప్పటికీ.. అతిగా పరీక్షించుకోవడం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనిని ‘బీపీ యాంగ్జైటీ’ అని కూడా పిలుస్తారు. పదే పదే చెక్ చేసుకోవడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, దాని వల్ల రీడింగ్స్‌లో వచ్చే మార్పులు, సరైన పద్ధతిలో బీపీ ఎలా చూసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రక్తపోటును అతిగా పరీక్షించుకోవడం వల్ల కలిగే నష్టాలు:
నేటి కాలంలో.. డిజిటల్ బీపీ మిషన్లు అందుబాటులోకి రావడంతో.. చాలా మంది ఇంట్లోనే రక్తపోటును పరీక్షించుకుంటున్నారు. ఇది ప్రాణాలను రక్షించే మంచి అలవాటే అయినప్పటికీ.. రోజుకు పదుల సంఖ్యలో చెక్ చేయడం వల్ల ప్రయోజనం కంటే.. నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1. బీపీ యాంగ్జైటీ:
మీరు ప్రతి గంటకు ఒకసారి బీపీ చెక్ చేసుకుంటుంటే.. అది మీలో తెలియని ఆందోళనను పెంచుతుంది. ఒక సారి రీడింగ్ కొంచెం ఎక్కువగా వస్తే.. దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడటం వల్ల మరుసటి సారి చెక్ చేసినప్పుడు బీపీ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. దీనిని శాస్త్రీయంగా “వైట్ కోట్ ఎఫెక్ట్” కి దగ్గరగా ఉండే పరిస్థితిగా చెప్పవచ్చు.
2. తప్పు రీడింగ్స్ వచ్చే అవకాశం:
రక్తపోటు అనేది రోజంతా ఒకేలా ఉండదు. మీరు నడిచినప్పుడు, కాఫీ తాగినప్పుడు, భయం వేసినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు బీపీ మారుతూ ఉంటుంది. వెంట వెంటనే బిపి చెక్ చేయడం వల్ల వచ్చే హెచ్చుతగ్గులను చూసి, మీకు లేని అనారోగ్యం ఉందని భ్రమపడే అవకాశం ఉంది.
3. రక్తనాళాలపై ఒత్తిడి:
బీపీ మిషన్ కఫ్ మీ చేతికి గట్టిగా బిగుసుకున్నప్పుడు, అక్కడ రక్త ప్రసరణ తాత్కాలికంగా ఆగుతుంది. పదే పదే ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలోని కండరాలు లేదా రక్తనాళాలు స్వల్పంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల రీడింగ్స్‌లో ఖచ్చితత్వం తగ్గుతుంది.
4. మానసిక ఒత్తిడి:
అతిగా బీపీని పర్యవేక్షించడం అనేది ఒక రకమైన ‘అబ్సెసివ్ బిహేవియర్’గా మారవచ్చు. ఇది మీ రోజువారీ పనులపై దృష్టిని మళ్ళించి, మిమ్మల్ని అనారోగ్య సమస్యలను పెంచుతుంది.
సరైన పద్ధతి ఏంటి?
మీరు హైపర్ టెన్షన్ కోసం మందులు వాడుతుంటే.. లేదా డాక్టర్ సలహా ఇస్తే తప్ప, రోజుకు 1 లేదా 2 సార్లు చెక్ చేసుకోవడం సరిపోతుంది. సాధారణంగా..
ఉదయం: నిద్రలేచిన తర్వాత, మందులు వేసుకోకముందు.
సాయంత్రం: భోజనానికి ముందు లేదా పని పూర్తి చేసుకున్న తర్వాత.
బీపీ చెక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పరీక్షకు 30 నిమిషాల ముందు టీ, కాఫీ తాగకూడదు. ధూమపానం చేయకూడదు.
కుర్చీలో వెన్ను నిటారుగా ఉంచి, పాదాలు నేలపై ఆనించి కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి.
బిపి మిషన్ కఫ్ మీ గుండె ఉన్న ఎత్తులో ఉండాలి.
రీడింగ్ తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
బీపీని మానిటర్ చేయడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు, కానీ అది ఒక వ్యసనంలా లేదా ఆందోళన కలిగించే అంశంగా మారకూడదు. మీ రీడింగ్స్‌లో ఏవైనా భారీ మార్పులు కనిపిస్తే, సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.