టీ, కాఫీలతో చాలామంది బిస్కెట్లను తింటారు. ఒకసారి కొబ్బరి బిస్కెట్లు తినేందుకు ప్రయత్నించండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ గా ఇవ్వడానికి కూడా కొబ్బరి బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బయట కూడా దొరుకుతాయి. కానీ ఇంట్లోనే వీటిని సులువుగా చేసుకోవచ్చు. ఈ క్రంచీ కొబ్బరి బిస్కెట్లు చేయడం చాలా సులువు రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
కొబ్బరి బిస్కెట్లు రెసిపీకి కావలసిన పదార్థాలు
బటర్ – అరకప్పు
పంచదార పొడి – అరకప్పు
ఎండు కొబ్బరి తురుము – అరకప్పు
మైదా – ఒక కప్పు
బేకింగ్ పౌడర్ – అర స్పూను
వెనిల్లా ఎసెన్స్ – అర స్పూను
పాలు – సరిపడినంత
కొబ్బరి బిస్కెట్లు రెసిపీ
1. బటర్ కరిగించి ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు అదే బటర్లో పంచదార పొడిని కూడా వేసి బాగా కలపండి. ఇది క్రీమీగా, మృదువుగా అవుతుంది.
2. ఇందుకోసం మీరు మూడు నుంచి నాలుగు నిమిషాలు గిలకొట్టాల్సి వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు మైదా పిండిని బాగా జల్లించి ఒక గిన్నెలో వేయండి.
4. అందులోనే ఎండు కొబ్బరి పొడి, బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపండి.
5. రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పాలు కూడా వేయండి.
6. ఇది మెత్తని పిండిలా దగ్గరగా అయ్యేవరకు బాగా పిసకండి.
7. చపాతీ పిండి లేదా పూరి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. మీరు నీటికి బదులు పాలను వేయాలి.
8. ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న ముద్దను తీసి చేత్తోనే బిస్కెట్లలా ఒత్తుకోండి.
9. కొబ్బరి, పంచదార కలిపిన పొడిలో దాన్ని దొర్లించండి. వీటిని ఓవెన్ లో పెట్టి బేక్ చేయండి.
10. 150 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేస్తే టేస్టీ కొబ్బరి బిస్కెట్లు రెడీ అయిపోతాయి.
11. వీటిని కొబ్బరి కుకీలు అని కూడా పిలుచుకుంటారు.
వీటిని ఒకసారి చేసుకుంటే గాలి చేరబడిన డబ్బాలో వేసి దాచుకోవచ్చు. ఇవి మూడు నాలుగు వారాలు పాటు తాజాగా ఉంటాయి. క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి.
బయట కొనే కుకీల కన్నా ఇలా ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. కొబ్బరికి బదులుగా మీరు ఎండ ద్రాక్ష, బాదం, వాల్నట్స్, పిస్తాలు వంటివాటి తురుమును కూడా జల్లుకోవచ్చు. రకరకాలుగా మార్చి వీటిని వండుకోవచ్చు. ఇవి తినేందుకు రుచిగా ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. కేవలం పిల్లలే కాదు పెద్దలకు కూడా ఇవి నచ్చుతాయి.