Chia Seeds: చియా విత్తనాలు చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. చియా సీడ్స్ ను నానబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. చియా సీడ్స్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట చియా సీడ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మంచి నిద్రకు సహాయపడుతుంది: చియా విత్తనాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ , మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ హార్మోన్లు ప్రశాంతంగా నిద్రపోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. రాత్రి పడుకునే ముందు చియా విత్తనాలు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: చియా సీడ్స్‌లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ నీటిని గ్రహించి జెల్ లా మారుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయ పడుతుంది. రాత్రిపూట నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల ఉదయం సులభంగా మల విసర్జన జరుగుతుంది.
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది: చియా సీడ్స్‌ల్లోని ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉండవచ్చు. తద్వారా బరువు తగ్గడంలో ఇది సహాయ పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: చియా విత్తనాల్లోని ఫైబర్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మది చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, అంతే కాకుండా రక్త పోటును నియంత్రించడానికి ఇవి సహాయపడతాయి.
Also Read: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?
శరీరానికి శక్తినిస్తుంది: రాత్రిపూట చియా సీడ్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. తద్వారా మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు.
చియా విత్తనాలను ఎలా తీసుకోవాలి ?
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ చియా విత్తనాలను నానబెట్టండి. ఉదయం ఈ మిశ్రమాన్ని తాగవచ్చు. లేదా.. రాత్రిపూట నానబెట్టిన చియా సీడ్స్ పాలు, పెరుగు లేదా పండ్ల రసంలో కలిపి కూడా దీనిని తినవచ్చు. ఈ అలవాటును క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.