కిచిడీలో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ ఉంటాయి. ఎందుకంటే దీన్ని మనం అన్ని రకాల కూరగాయలను కలిపి చేస్తాము. అన్నంతో, పెసరపప్పుతో చేసే కిచిడి అందరికీ తెలుసు. ఇక్కడ మేము సజ్జలతో చేసిన కిచిడి ఇచ్చాము. ముఖ్యంగా మధుమేహ రోగులకు ఈ సజ్జల కిచిడి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ సజ్జలతో చేసిన కిచిడి సహాయపడుతుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
సజ్జలతో మసాలా కిచిడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
సజ్జలు – ఒకటిన్నర కప్పు
బంగాళదుంపలు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
టమోటా – ఒకటి
క్యారెట్లు – ఒకటి
నెయ్యి – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – ఒక స్పూను
ఇంగువ – చిటికెడు
లవంగాలు – రెండు
పసుపు – అర స్పూను
కారం – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
బిర్యానీ ఆకు – రెండు
నీళ్లు – రెండు గ్లాసులు
సజ్జల కిచిడి రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే సజ్జలను ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ ను పెట్టాలి. కుక్కర్లో నెయ్యి వేసి వేడి చేయాలి.
4. అందులో లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంగువ వేసి వేయించాలి.
5. తర్వాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
6. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను, క్యారెట్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. అలాగే టమోటో తొరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా కలపాలి.
8. ఇందులోనే పసుపు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇదంతా దగ్గరగా కూర లాగా అయ్యేవరకు కలుపుకోవాలి.
10. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సజ్జలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఇది ఉడకడానికి సరిపడా నీటిని వేసి కుక్కర్ మూత పెట్టేయాలని.
12. మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
13. తర్వాత మూత తీసి మరి కొంచెం నీళ్లు పోసి కిచిడీ లాగా మెత్తగా జ్యూసీగా వచ్చేవరకు ఉడికించాలి.
14. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని పెరుగుతో లేదా నెయ్యితో తింటే అదిరిపోతుంది.
మధుమేహ రోగులు ఈ సజ్జల కిచిడీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వారికి శక్తి అందుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ కిచిడిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఆరోజంతా మీరు తక్కువ ఆహారాన్ని తింటారు. అలాగే ఈ కిచిడీలో ఉన్న శక్తి శరీరానికి అందుతుంది. కాబట్టి నీరసపడరు. ఒకసారి సజ్జలతో కిచిడి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.