ఆపరేషన్ సిందూర్.. ఆ పేరు చెబితేనే భారతీయుల గుండె ఉప్పొంగుతుంది. పహల్గాం మారణ హోమానికి భారత సైన్యం తీర్చుకున్న ప్రతీకార చర్య అది. భారతీయ మహిళల సిందూరాన్ని తుడిచేసినందుకు, పాకిస్తాన్ పీచమణిచిన సైనిక చర్యే ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్ విషయంలో గణాంకాలు, కథనాలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే భారతీయ సైనిక సత్తా చాటి చెప్పే వీడియోలు మాత్రం అతి కొద్దిగానే లభ్యమవుతున్నాయి. అలాంటి అరుదైన మరో వీడియోని భారత వాయుసేన విడుదల చేసింది. అయితే ఇందులో ఆపరేషన్ సిందూర్ తో పాటు, గతంలో జరిగిన యుద్ధాల ఉదాహరణలు కూడా ఉన్నాయి. యుద్ధం ఎప్పుడొచ్చినా, భారత వాయుసేన ఎంత సిద్ధంగా ఉంటుందో, శత్రువుపై ఎలా శతఘ్నుల పిడుగులు కురిపిస్తుందో ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
Indian Air Force -Touch the Sky with Glory#IndianAirForce#YearOfDefenceReforms@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia@indiannavy@CareerinIAF pic.twitter.com/FhFa3h8yje
— Indian Air Force (@IAF_MCC) August 10, 2025
కార్గిల్ టు సిందూర్..
ఉగ్రదాడులకు భారత్ ఎప్పుడూ ధీటుగానే బదులిస్తోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా గట్టి గుణపాఠం చెబుతోంది. ఈ గుణపాఠాల్లో భారత వాయుసేన భాగస్వామ్యమే ఎక్కువ అని చెప్పాలి. క్షిపణి దాడులతో శత్రుదేశం భయపడిపోయేలా భారత వాయుసేన తన సత్తా చూపుతోంది. 1971లో జరిగిన యుద్ధంలో భారత వాయుసేన ఎలా పోరాడింది, కార్గిల్ వార్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన మెరుపుదాడులు ఎలా చేపట్టింది, చివరిగా ఆపరేషన్ సిందూర్ లో మన సత్తా ఏంటి..? అనే విషయాలను విపులంగా చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 6నిమిషాల వీడియోని భారత వాయుసేన విడుదల చేసింది. గగనతలం చీకటిగా మారినప్పుడు.. భూతలం నుంచి ముప్పు ఎదురైనప్పుడు ఒక శక్తి బయటకు వస్తుంది, అది నిర్భయంగా ప్రతిఘటిస్తుంది, ఆ శక్తి పేరే భారత వాయుసేన.. అంటూ ఆ వీడియో ఆసక్తికరంగా ఉంది.
మన పరాక్రమం..
భారత వాయుసేన పరాక్రమాన్ని ఎంత వర్ణించినా తక్కువే. యుద్ధభూమిలో మన వాయుసేన ఎలాంటి చురుకైన నిర్ణయాలు తీసుకుంది, వాటి ఫలితం ఏంటి, శత్రువుల్ని తుదముట్టించేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నింది అనే విషయాలు సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసినా కథనాల రూపంలో వాటిని మనం ఊహించుకోవాల్సిందే. అయితే ఇప్పుడు వాయుసేనే వారి పరాక్రమాలను కళ్లకు కట్టేలా వీడియో విడుదల చేయడం విశేషం. ఈ వీడియోలో పహల్గాం దాడికి సంబంధించిన కథనాలు, అనంతరం ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలవడం, అందులో భాగంగా పాక్ లోని ఉగ్ర శిబిరాలను భారత వాయుసేన నేలమట్టం చేయడం.. వంటి సంగతులన్నీ ఉన్నాయి. ఈ వీడియోను చూసినవారంతా ఒళ్లు గగుర్పొడుస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. భారత వాయుసేన పరాక్రమాన్ని కొనియాడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ లో దాదాపు 100మంది ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. పాక్ సైనిక బలం ఎంత అల్పమైనదో మరోసారి వారికి తెలిసొచ్చేలా చేసింది. భారత క్షిపణి దాడుల్ని ఎదుర్కొనేందుకు పాక్ రక్షణ వ్యవస్థ ఆపసోపాలు పడింది, ఆఖరికి అది విఫలం అని తేలిపోయింది. అదే సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల్ని భారత్ చాకచక్యంగా ఆకాశంలోనే చీల్చిచెండాడింది. ఆపరేషన్ సిందూర్ వివరాలతో విడుదలైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది.