Real estate Hyderabad: మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం అనేది తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారుజ తమ కష్టార్జితాన్ని అంతా పోగేసి ఒక గూడు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తారు. దీని కోసం వారు ఎన్ని త్యాగాలైనా చేసేందుకు వెనుకాడరు. అలాంటి కలల సౌధాన్ని కూల్చేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరిట పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇలాంటి ఆఫర్లను చూసి మోసపోతున్న వార్తలు కూడా మీడియా కథనాల్లో కోకొల్లలుగా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఒక వివాదం రాజేస్తున్నటువంటి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి… ఈ ఆఫర్ల వల్ల కస్టమర్లకు కలిగే లాభం ఏంటి..? ఇలాంటి ఆఫర్లతో నిజంగానే తక్కువ ధరకే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చా వంటి వివరాలను తెలుసుకుందాం.
ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభించక ముందే పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతుంటాయి. అందులో ముఖ్యంగా అనేక రకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లలో ముఖ్యంగా వినిపించేది మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే ప్లాటు అందిస్తామని ప్రకటిస్తారు. లేదా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులలో కూడా ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ లలో భాగంగా నిర్మాణం జరగక ముందే తక్కువ ధరకే ఫ్లాట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొడతారు. వీలైతే సినిమా హీరోలను, టీవీ సీరియల్ నటులను, ఈ ప్రీ లాంచ్ ఆఫర్లను పబ్లిసిటీ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటారు.
ముఖ్యంగా ప్రీ లాంచ్ ఆఫర్లను పబ్లిక్ లోకి బలంగా తీసుకొని వెళ్లడానికి మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తారు. దీనికి తోడు టెలికాలర్స్ అందరికీ కాల్స్ చేసి తమ ఆఫర్లను వివరించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఆకర్షణీయమైన బ్రోచర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ సక్సెస్ చేసేందుకు అన్ని రకాల మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ బారినపడి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని మాయమాటలు చెప్పి వందల కోట్లను వెనకేసుకొని బోర్డు తిప్పేసిన సంస్థలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పుట్టుకొస్తున్నాయి.
ప్రీ లాంచ్ పేరిట మోసం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం
>> . రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేకుండానే కనీసం నిర్మాణం కూడా ప్రారంభం అవ్వకముందే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆఫర్…ఆఫర్ అంటూ ఊదరగొట్టేస్తుంటారు. దీని వెనక ఉన్న మతలబు వీలైనంత మంది ఎక్కువ కష్టమర్లను ఆకర్షించడమే అని చెప్పవచ్చు.
>> సాధారణంగా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రారంభించాలి అంటే రెరా (RERA), GHMC, HMDA వంటి ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండానే కనీసం భూమి పూజ కూడా చేయకుండానే, ఆకర్షణీయమైన ఆఫీసు ఏర్పాటు చేసి, రంగురంగుల బ్రోచర్లు, త్రీడీ యానిమేషన్ గ్రాఫిక్స్ ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్లు డిజైన్లు గీయిస్తారు. ఆ తరువాత సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించి ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ అడ్వటైజ్మెంట్ చేస్తుంటారు. అలాగే టెలికాలర్స్ తో ఆకర్షణీయంగా మాట్లాడిస్తారు. ఈ తతంగం అంతా కస్టమర్లను ఆకర్షించి తమ ఆఫర్ల వలలో బిగించడమే అంతిమ లక్ష్యంగా చెప్పవచ్చు.
>> ఇటీవల జరిగిన కొన్ని మోసాల్లో ప్రధానంగా ఎక్కువగా న్యాయపరమైన చిక్కులు, అనుమతులు లేని భూముల్లో ప్రాజెక్టులు నిర్మించేవారు, పర్యావరణ అనుమతులను ఉల్లంఘించినవారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్న స్థలాలు, చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రాజెక్టులు చేపట్టిన వారు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించి, అందిన కాడికి దోచుకొని ప్రాజెక్టు మధ్యలోనే వదిలేసి బోర్డు తిప్పేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఇలా అప్రమత్తంగా ఉంటే మోసం జరగదు
>> కస్టమర్లు ఎవరైనా ప్రీ లాంచ్ ఆఫర్లకు ఆకర్షితులు అయినట్లయితే ముందుగా మీరు కొనుగోలు చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది. . అలాగే మీరు కొనుగోలు చేయబోయే ప్రాపర్టీ కి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ప్రాపర్టీ కి సంబంధించి ఎలాంటి స్టేటస్ ఉంది. వంటి వివరాలను తెలుసుకుంటే మంచిది.
>> ఉదాహరణకు మీరు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ నిర్మాణ దశలోనే ప్రీ లాంచ్ ఆఫర్ లో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ముందుగా ఆ అపార్ట్మెంట్ నిర్మించడానికి కావాల్సిన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెరా, GHMC, ఫైర్ డిపార్ట్‌మెంట్ వంటి విభాగాల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. బిల్డర్ అలాంటి అనుమతులను పొందారా లేరా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది,
>> ప్రీ లాంచ్ ఆఫర్ల కోసం ఆశపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ రూపంలో డబ్బు చెల్లించకూడదు. లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ద్వారా జరగాలి.
>> ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థ చెరువుల సంరక్షణతో పాటు భూముల సంరక్షణ కూడా చేపడుతోంది. ముఖ్యంగా మీరు కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చెరువుల పరిధిలో ఉందా లేదా అని వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా మీరు మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు.