కొబ్బరి పచ్చడి మనం కూడా చేసుకుంటాం. ఎంతో మందికి కొబ్బరి చట్నీ చేయడం వచ్చు. అయితే మన స్టైల్ లో కాకుండా ఒకసారి కేరళ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దోశతో తిన్నా ఇడ్లీతో తిన్నా అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినవచ్చు. కేరళ స్టైల్ లో చేసే కొబ్బరి చట్నీని ఒకసారి టేస్ట్ చేశారంటే స్పూను కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
కేరళ స్టైల్ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు
కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
అల్లం తరుగు – ఒక స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కారం – అర స్పూను
లవంగాలు – మూడు
వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
ఉల్లిపాయలు తరుగు – అరకప్పు
కరివేపాకులు – గుప్పెడు
ఎండు మిర్చి – రెండు
నీరు – తగినంత
ఆవాలు – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
నూనె – రెండు స్పూన్లు
కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
3. వాటిని చల్లార్చి మిక్సీ జార్లో వేయాలి.
4. ఆ మిక్సీ జార్లోనే కొబ్బరి తురుము, అల్లం తరుగు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. ఎండుమిర్చిని కూడా వేయడం మర్చిపోవద్దు. కొద్దిగా నీరు పోసి చట్నీలా రుబ్బుకొని తీసి ఒక కప్పులో వేసుకోవాలి.
6. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
8. తర్వాత రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి. చివరగా కరివేపాకులను వేసి వేయించి ఈ తాలింపును చట్నీపై వేసుకోవాలి.
9. అంతే టేస్టీ కేరళ స్టైల్ చట్నీ తయారైనట్టే. ఇందులో మనం ప్రత్యేకంగా ఉల్లిపాయలను జత చేసాము. కాబట్టి దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. కేరళలో కొబ్బరి నూనెతోనే దీన్ని వండుతారు. కాబట్టి దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
మీరు కొబ్బరి నూనెతో తినగలరు అనుకుంటే తాలింపును కొబ్బరి నూనెతో వేసుకోవడానికి ప్రయత్నించండి. కొబ్బరి నూనె అన్ని నూనెల కంటే ఆరోగ్యకరమైనది కూడా. కేరళలో కేవలం కొబ్బరినూనె మాత్రమే వంటనూనెగా వాడుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేరళ స్టైల్ లో కొబ్బరి చట్నీ రుచి ప్రత్యేకంగా తెలియాలంటే కొబ్బరి నూనెను వాడితేనే బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చడం ఖాయం.
కొబ్బరి తురుమును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీకు థైరాయిడ్ సమస్యలు, మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటి పచ్చళ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి కొబ్బరిలో ఉండే పోషక విలువలు చేరుతాయి. పచ్చి కొబ్బరి మన చర్మానికి ఎంతో సహాయపడుతుంది. మన చర్మాన్ని మెరిపించడంలో ఇది ముందుంటుంది. కాబట్టి పచ్చికొబ్బరితో చేసే ఇలాంటి పచ్చడిని తినడం ఎంతో ఆరోగ్య కరం చాలామంది కొబ్బరి పత్రి చేసేటప్పుడు కొబ్బరి ముక్కలను కూడా నూనెలో వేయిస్తారు. అలా వేయించాల్సిన అవసరం లేదు నేరుగా మిక్సీ జార్లో వేసి పచ్చిగానే రుబ్బితే దాని సహజమైన సువాసన ఫ్లేవర్ వంటివి చట్నీకి వస్తాయి.
Also Read: అటుకులతో రవ్వ కేసరి ఇలా చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇదిగో