పండుగలు వస్తే తీపి పదార్థాలు ఇంట్లో ఉండాల్సిందే. కేసరి, హల్వా లాంటివి పండగలు వస్తే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్లు కాకుండా కొత్తగా అటుకులతో రవ్వ కేసరి చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. పైగా రుచిగా ఉంటుంది. అటుకులతో చేసే ఈ స్వీట్లు టేస్టీ గానే వస్తాయి. పైగా చాలా తక్కువ సమయంలోనే వీటిని వండొచ్చు. అటుకుల రవ్వ కేసరి ఎస్పీ ఎలాగో తెలుసుకోండి.
అటుకుల రవ్వ కేసరి రెసిపీకి కావలసిన పదార్థాలు
అటుకులు – ఒక కప్పు
నీళ్లు – రెండు కప్పులు
ఆరెంజ్ ఫుడ్ కలరు – చిటికెడు
కిస్ మిస్‌లు – రెండు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు
యాలకుల పొడి – అర స్పూను
నెయ్యి – రెండు స్పూన్లు
పంచదార – ఒక కప్పు
అటుకుల రవ్వ కేసరి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అటుకులను వేసి వేయించాలి.
2. అవి రంగు మారకుండా చూసుకోవాలి కరకరలాడేలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
3. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రవ్వలాగా రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి.
5. నెయ్యిలో జీడిపప్పులు, కిస్ మిస్‌లు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో రెండు కప్పుల నీళ్లు వేసి అటుకుల రవ్వను వేసి కలుపుకోవాలి.
7. రవ్వ మెత్తగా ఉడికేలా చిన్న మంట మీద ఉడికించాలి.
8. అందులోనే పంచదారను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకోవాలి.
10. చిటికెడు ఆరంజ్ ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలపాలి.
11. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే వేయాల్సిన అవసరం లేదు.
12. ఫుడ్ కలర్ వేయకపోతే కేసరి తెలుపు రంగులోనే ఉంటుంది.13. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసి కలుపుకోవాలి.
14. చివరన చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కూడా వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ అటుకుల రవ్వ కేసరి రెడీ అయినట్టే.
ఏదైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు చాలా తక్కువ సమయంలోనే స్వీట్లు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలా అటుకులతో రవ్వ కేసరి చేసి చూడండి. కేవలం పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. మీరు మరింత టేస్ట్ కోసం దీంట్లో కాస్త కోవా లేదా పాలు వంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సంక్రాంతికి భోగికి కూడా సింపుల్ గా స్వీట్ చేయాలనుకుంటే అటుకుల రవ్వ కేసరిని ఒకసారి ప్రయత్నించండి. మిగతా కేసరితో పోలిస్తే అటుకుల రవ్వ కేసరి మెత్తగా వస్తుంది. ఎందుకంటే అటుకులు చాలా మృదువుగా ఉంటాయి. కాబట్టి ఈ కేసరి కూడా మృదువుగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. మీకే తెలుస్తుంది దీని రుచి.
Also Read: జీడిపప్పు పకోడీ కొంటె ఎక్కువ ఖర్చు పెట్టాలి, అందుకే ఇంట్లోనే ఇలా చేసేయండి