ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే కొన్ని మంచి ఆరోగ్యకరమైన పనులు చేస్తే దాని వల్ల ఆ రోజుమొత్తం ఉల్లాసంగా, ఉత్తేజంగా సాగుతుంది. నిద్రలేవగానే ఒత్తిడితో ఉంటే రోజంతా గందరగోళం, అలసట, ప్రతికూల ఆలోచనలను ఉంటుంది. కానీ కొన్ని సులభమైన ఆరోగ్యకర అలవాట్లు మీ మూడ్, ఏకాగ్రత, ఎనర్జీ లెవెల్స్ మెరుగుపరుస్తాయి. ప్రశాంతమైన ఉదయం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే మీరు ఆలోచించే విషయాలు రోజంతా మీ భావోద్వేగాలను నిర్ణయిస్తాయి. చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తారు.. లేదా సమస్యల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అలా చేయడం తప్పు. దానికి బదులు ఉదయం కృతజ్ఞతా భావంతో మొదలు పెట్టండి. మెడిటేషన్ చేయండి, పూజలు, ప్రార్థనలు చేయండి, లేదా ఒక్క క్షణం మీకు జీవితాన్నిచ్చిన భగవంతుడు, తల్లిదండ్రులను ధన్యవాదాలు చెప్పండి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
రాత్రి నిద్రలో శరీరం నుంచి నీరు కోల్పోతుంది. ఉదయం నీటి కొరత వల్ల అలసట, తలనొప్పి, శక్తి తగ్గుతాయి. నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియ, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. వెచ్చని నీళ్లు లేదా నిమ్మరసం కలిపి తాగితే మరింత మంచి ఫలితాలు వస్తాయి.
ఉదయం తాజా గాలి శరీరం, మానసిక ఆరోగ్యానికి మంచిది. కిటికీలు తెరవడం లేదా బయటకు వెళ్లడం వల్ల మనసు తాజాగా ఉంటుంది. ఉదయం లభించే తొలి సూర్యకాంతి లేతగా ఉంటుంది. తాజా గాలి శరీర గడియారాన్ని సక్రమంగా ఉంచి, మూడ్, ఎనర్జీని పెంచుతుంది. కేవలం 10-15 నిమిషాలు కూడా ఉదయాన్నే ఎండలో ఉండడం వల్ల అలసట తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది.
ఉదయం శారీరక కదలిక రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు మెదడు పనితీరును పెంచుతుంది. స్ట్రెచింగ్, యోగా, నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మూడ్ మెరుగుపడి, ఒత్తిడి తగ్గుతుంది. తీవ్రమైన వ్యాయామం అవసరం లేదు. 10 నిమిషాల స్ట్రెచింగ్ కూడా శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెంచి, అలసటను తగ్గిస్తుంది.
ఉదయం మెదడు తాజాగా ఉండటం వల్ల పనులను స్పష్టంగా ప్లాన్ చేయడం సులభం. ఒక చిన్న జాబితా తయారు చేయడం వల్ల రోజంతా గందరగోళం తగ్గుతుంది. ముఖ్యమైన పనులను ముందు ఉంచండి. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. ముందుగానే ప్లాన్ చేసి పనులు చేస్తే పనులు వాయిదా వేయడం, ఆలస్యం కావడం చివరి నిమిషంలో ఆందోళన చెందడం లాంటి సమస్యలు నివారించవచ్చు.
Also Read: కోడి గుడ్డు బాయిల్ చేస్తే ఈ గుర్తులు కనిపిస్తే పొరపాటున కూడా తినకండి.. చాలా ప్రమాదం
ఉదయం లేవగానే ఫోన్ చూడడం ఒత్తిడిని పెంచుతుంది. ఉదయాన్నే ఒక గంట సేపు ఫోన్ చూడకుండా గడపండి. ఫోన్ చూడడం మానేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యకర అలవాట్లపై దృష్టి పెట్టండి.
ఉదయం మంచి అలవాట్లు క్రమం తప్పకుండా పాటిస్తే రోజంతా ఎనర్జెక్టిక్‌గా, ఏకాగ్రత, ఒత్తిడి లేకుండా గడపవచ్చు. చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మెరుగుపరుస్తాయి.