Cyanide: యాపిల్స్ అంటే అందరికీ ఇష్టమైన పండు. రుచికరమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటిని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కానీ, యాపిల్స్ గింజల్లో సైనైడ్ అనే విషపదార్థాన్ని విడుదల చేసే ఒక సమ్మేళనం ఉంటుందని చాలామందికి తెలియదు. దీనివల్ల యాపిల్స్ గింజలు హానికరమా, వాటిని తింటే ఏమవుతుంది, ఎలా సురక్షితంగా ఉండాలి అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..
సైనైడ్ ఎలా ఉంటుంది?
యాపిల్స్ గింజల్లో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ గింజలను నమిలినప్పుడు లేదా పగలగొట్టినప్పుడు అది సైనైడ్‌గా మారుతుంది. సైనైడ్ ఒక విషం, ఇది శరీరంలో ఆక్సిజన్‌ను ఉపయోగించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే, ఆపిల్ గింజల్లో అమిగ్డాలిన్ మోతాదు చాలా తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా, గింజలకు గట్టి పొర ఉండటం వల్ల, వాటిని మొత్తంగా మింగితే సైనైడ్ విడుదల కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, గింజలను నమిలితే లేదా పొడిచేస్తే సైనైడ్ ఉత్పత్తి అవుతుందని అంటున్నారు.
గింజలు ఆరోగ్యానికి హానికరమా?
చిన్న మోతాదులో, పొరపాటున కొన్ని గింజలు మింగితే సాధారణంగా హాని ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. మానవ శరీరం తక్కువ మొత్తంలో సైనైడ్‌ను తట్టుకోగలదట. అయితే, పెద్ద సంఖ్యలో గింజలను నమిలి మింగితేనే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం, ఒక పెద్దవాడు సుమారు 150–200 గింజలను నమిలి మింగాలి. పిల్లలకు శరీరం చిన్నది కాబట్టి, వారికి తక్కువ గింజలతోనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
చాలా గింజలు తింటే ఏమవుతుంది?
పెద్ద మొత్తంలో నమిలిన గింజలు తింటే సైనైడ్ పాయిజన్ కలుగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనైడ్ పాయిజన్ వస్తే తలతిరగడం, గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది ప్రాణాంతకం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా అరుదు, ఎందుకంటే ఎవరూ ఉద్దేశపూర్వకంగా ఇన్ని గింజలను నమిలి తినరు.
పొరపాటున గింజలు తినేస్తే ఏం చేయాలి?
కొన్ని గింజలను పొరపాటున మొత్తంగా మింగితే సాధారణంగా భయపడాల్సిన అవసరం లేదు. అవి జీర్ణవ్యవస్థ ద్వారా సైనైడ్ విడుదల కాకుండా బయటకు వెళ్లిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ఎవరైనా ఎక్కువ గింజలను నమిలి తిని, అసౌకర్యంగా ఫీల్ అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్లు ఆక్సిజన్ థెరపీ లేదా హైడ్రాక్సోకోబాలమిన్ వంటి యాంటీడోట్‌లతో చికిత్స చేయవచ్చు.
ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి?
యాపిల్ గింజలను తినకపోవడమే సులభమైన మార్గం. యాపిల్స్ తింటున్నప్పుడు కోర్‌ను కట్ చేసి గింజలను పారేయాలి. పిల్లలకు ఇది మరింత ముఖ్యం, ఎందుకంటే వారు సైనైడ్ ప్రభావానికి త్వరగా లోనవుతారు. ఇంట్లో ఆపిల్ జ్యూస్ లేదా ఆపిల్ సాస్ చేస్తున్నప్పుడు గింజలను తొలగించండి. యాపిల్ గింజల ప్రమాదం గురించి ఇతరులకు చెప్పడం ద్వారా కూడా పొరపాటున తినకుండా నిరోధించవచ్చు.
యాపిల్స్ గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే సమ్మేళనం ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో నమిలి తినకపోతే ఆరోగ్యానికి ప్రమాదం తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. పొరపాటున కొన్ని గింజలు తినేసినా సమస్య ఉండదు, కానీ ఉద్దేశపూర్వకంగా తినకూడదు. యాపిల్స్ తినే ముందు గింజలను తొలగించడం, ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.