ఆపరేషన్ సిందూర్ తో భారత దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు ఈ యుద్ధంలో ఉమ్మడిగా పాల్గొన్నాయి. ఈ ఉమ్మడి దాడుల ఫలితంగా పాక్ కి గట్టి గుణపాఠం చెప్పినట్టయింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఏక కాలంలో భారత్ దాడి జరిపింది. ఇది ఆషామాషీ దాడి కాదు. పక్కా వ్యూహంతో పాక్ పై భారత్ చేసిన దాడి. ఈ దాడి గురించి కీలకమైన 5 విషయాలు ఇవే.
తెల్లవారుఝామున 1.44 గంటలకు..
తెల్లవారితే భారత్ లో యుద్ధ వాతావరణానికి సంబంధించిన మాక్ డ్రిల్ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. అయితే రాత్రికి రాత్రే పాక్ లోని 9 స్థావరాలలో బాంబుల మోత మోగుతుందని ఎవరూ ఊహించలేదు. అంత పగడ్బందీగా, పక్కా ప్రణాళికతో, అత్యంత రహస్యంగా ఆపరేషన్ సిందూర్ ని మొదలు పెట్టి ముగించింది భారత్. సరిగ్గా తెల్లవారుఝామున ఒంటిగంటా 44 నిముషాలకు అటాక్ మొదలైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రమూలాలు ఉన్న 9 స్థావరాలపై దాడులు జరిగాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
వార్ హెడ్ లు..
వాయుసేన వార్ హెడ్ లతో 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల మోత మోగించింది. ప్రత్యర్థి విమాన దాడులకు తెగబడటానికి ప్రయత్నించడంతో లేజర్ గైడెడ్ మిసైల్స్ లో ఆ విమానాలను తుత్తునియలు చేశారు. ఇందులో ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు సామగ్రి, కామికేజ్ డ్రోన్‌లు ఉపయోగించారు. ఈ వార్‌హెడ్ లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఢీకొట్టి నాశనం చేశాయి.
ఉగ్ర సంస్థ నాలుగు స్థావరాలు ఖతం..
జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నాలుగు స్థావరాలు ఆపరేషన్ సిందూర్ లో ధ్వంసమయ్యాయి. బహవల్ పూర్ లోని మర్కజ్ సుభాన్ అల్లా, టెహ్రా కలాన్ లోని సర్జల్, కోట్లిలోని మర్కజ్ అబ్బాస్, ముజఫరాబాద్ లోని సయ్యద్నా బిలాల్ శిబిరాలపై దాడి జరిగింది. మరో ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా కి చెందిన మూడు స్థావరాలను కూడా భారత్ లక్ష్యంగా చేసుకుంది. ముర్దికేలోని మర్కజ్ తైబా, బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీత్, ముజఫరాబాద్ లోని ష్వాయ్ నల్ల శిబిరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇక మిగిలిన రెండు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన స్థావరాలు. కోట్లిలోని మకాజ్ రహీల్ షాహిద్, సియాల్ కోట్ లోని కీలకమైన మెహమూనా జోయా స్థావరాలను భారత్ టార్గెట్ చేసుకుంది.
అవి మన లక్ష్యం కాదు..
భారత్ చేసిన దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలు, జనావాసాలు లక్ష్యంగా లేవని సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ లక్ష్యం పాక్ పౌరులు ఏమాత్రం కాదని తెలిపింది. కేవలం పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఉగ్ర మూకల కదలికలపై మనకు కచ్చితమైన సమాచారం ఉందనే సందేశాన్ని పాక్ కి పంపించినట్టయింది.
ఆపరేషన్ సిందూర్ అనే పేరుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారని అంటున్నారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు పురోగతి అడిగి తెలుసుకున్నారు. అర్థరాత్రి నుంచి ఆయన దాడుల పురోగతిని పర్యవేక్షించారు. ఇక మిషన్ ముగిసిన అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించి, అంతర్జాతీయ తీవ్ర వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు.