 
					సాధారణ సమయాలతో పోలిస్తే శీతాకాలంలోనే ఎక్కువ మందికి తలపై దురద పెడుతుంది. దీనికి కారణం తలపై ఉన్న మాడు విపరీతంగా పొడిబారడం. అయితే ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఈ సమస్య వాత దోషం అధికంగా ఉండడం వల్ల కలగవచ్చు. చర్మం పొడి బారడం, చల్లని గాలి వల్ల ఇలా జరుగుతుంది. శరీరంలో పోషకాహారం తగ్గినా కూడా ఇలా దురద వచ్చే అవకాశం ఉంది. తలపై ఉన్న మాడుకు రక్తప్రసరణ సరిగా జరగకపోయినా కూడా దురద అధికంగా రావచ్చు. జుట్టు కుదుళ్లు బలహీనపడటం, జుట్టు పొడిబారడం వంటివి కూడా దురదకు కారణం అవుతాయి. వీటికి కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఆ సమస్యను తీర్చుకోవచ్చు.
కొబ్బరి నూనె 
ప్రతి ఇంట్లోనూ కొబ్బరి నూనె ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో ఉన్న పోషకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రతిరోజూ మీరు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని తలకు మసాజ్ చేయండి. తలపై ఎప్పుడైతే రక్తప్రసరణ పెరుగుతుందో… వెంట్రుకలకు పోషణ అందుతుంది. అప్పుడు వెంట్రుకలు పొడిబారి సమస్య చాలా వరకు తగ్గుతుంది. మీరు స్నానం చేసే ముందు లేదా రాత్రి నిద్ర పోయే ముందు కొద్దిగా వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. దురద కూడా చాలా వరకు తగ్గుతుంది.
కలబంద జెల్ 
అలోవెరా మొక్క ఇంట్లోనే పెంచుకోవచ్చు. అలోవెరా జెల్ ను జుట్టు కోసం అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. తలపై దుదర, పొడి బారడం, చికాకు వంటి సమస్యలు ఉన్నవారు అలోవెరా జెల్ తో తగిన చికిత్సను పొందవచ్చు. తాజాగా కలబంద జెల్ సేకరించి తలపై మాడుకు తగిలేలా అప్లై చేయండి. ఒక పావుగంట పాటూ అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో తలన శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీకు తలపై ఉన్న చర్మం తాజాగా మారి ఎలాంటి దురద లేకుండా ఉంటుంది.
నిమ్మరసం 
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి ఈ విటమిన్ సి ఎంతో అవసరం. అలాగే దురదను తగ్గించడానికి కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని పిండి మాడుకు తగిలేలా అప్లై చేయండి. పావుగంట పాటు అలా వదిలేసాక గోరువెచ్చని నీటితో తలకు స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మీకు దురద నుండి ఉపశమనం కలుగుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఆలివ్ నూనె 
ఆలివ్ నూనెలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మన వెంట్రుకల మూలాల నుండి ఇవి బలోపేతం చేసి పోషణను ఇస్తాయి. జుట్టు పొడిబారి సమస్యను కూడా తగ్గిస్తాయి. ఆలివ్ నూనెను కొద్దిగా వేడి చేసి తలకు పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. లేదా పడుకునే ముందు తలకు పట్టించి రాత్రంతా ఉంచేసినా మంచిదే. ఉదయం లేచాక తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. పొడి జుట్టు తేమవంతంగా మారుతుంది. దురద నుండి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ 
ఆపిల్ సైడర్ వెనిగర్ మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తలపై ఉన్న మాడును శుభ్రపరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తలపై దురద వేధిస్తూ ఉంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించండి. ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని రెండు కప్పుల నీటిలో కలపండి. ఆ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అలాగే మాడుకు తగిలేలా అప్లై చేయండి. పావుగంట పాటు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తలపై ఉన్న బ్యాక్టీరియాను ఆపిల్ సైడర్ వెనిగర్ తొలగిస్తుంది. దురద కలిగించే కారకాలను కూడా ఇది తొలగించడంలో సహాయపడుతుంది.