 
					Bathroom Mistakes: శారీరక శుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేయడం ప్రతిఒక్కరికీ ఎంతో అవసరం. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లకి కూడా మంచిదే. కానీ, మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచితే సరిపోదండోయ్. గంటల తరబడి బాత్రూమ్‌లో కూర్చుంటున్నాం కాబట్టి.. ఆ ప్రదేశాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. పైగా చాలామంది టాయిలెట్ కమోడ్ మీద కూర్చుని గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. ఇంట్లో సభ్యులంతా ఉపయోగించే టాయిలెట్‌లో అనేక రకాల క్రిములు నివాసం ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే అనారోగ్య సమస్యలు రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
స్నానపు గదిలో చేసే చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యం, చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు మనతో పాటు మనం తీసుకెళ్లే స్మార్ట్‌ఫోనే రోగాలను తెచ్చిపెడుతున్నాయి. మనం ఉపయోగించే ఫోన్ మీద అనేక రకాల క్రిములు చేరే ప్రమాదం ఎక్కువ. కాబట్టి.. బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లకపోవడమే ఉత్తమం.
ముఖ్యంగా మగవాళ్లే టాయిలెట్‌లో గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు. టాయిలెట్ కమోడ్ మీద కూర్చొని అదే పనిగా ఫోన్‌లో స్క్రోలింగ్ చేస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు కమోడ్ మీద కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ (మొలలు) వచ్చే అవకాశం ఉంది. అలాగే టాయిలెట్‌ను ఫ్లష్ చేసే ముందు కమోడ్‌ను మూసివేసిన తర్వాతే ఫ్లష్ చేయాలి. అలా ఓపెన్ చేసి ఫ్లష్ చేయడం వల్ల, కలుషితమైన నీటి తుంపరలతో పాటు వ్యాధికారక క్రిములు గాలిలోకి వ్యాపించి, బాత్రూమ్‌లో ఉన్న వస్తువులపై చేరుతాయి.
చలికాలంలో చాలామంది వేడినీటితో స్నానాలు చేస్తుంటారు. అది కూడా గంటల తరబడి. అలా చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి, చూడటానికి అందవిహీనంగా కనిపిస్తుంది. కాబట్టి.. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడటం ఉత్తమం. అంతేకాదు.. స్నానానికి ఎక్కువ సబ్బును వాడటం లేదా రసాయనాలు అధికంగా ఉన్న బాడీవాష్‌లను ఉపయోగించటం కూడా చర్మానికి హాని చేయడమే అవుతుంది.
స్నానం పూర్తయిన తర్వాత అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే.. మన బలం కొద్దీ టవల్‌తో చర్మంపై రుద్దడం. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ చేసే కామన్ మిస్టేకే అయినప్పటికీ.. దీని వల్ల చర్మం ఎంతలా డ్యామేజ్ అవుతుందంటే.. దద్దుర్ల రూపంలో చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. మన చర్మం యొక్క సున్నితమైన ఉపరితలం దెబ్బతిని, ఎర్రగా వాచిపోవచ్చు కూడా. అందుకే స్నానం చేసిన తర్వాత చర్మాన్ని మృదువైన వస్త్రంతో మెత్తగా తుడుచుకోవడం లేదా టవల్‌ను చర్మంపై అద్ది తడిని పీల్చేలా చేస్తే సరి.