 
					మూత్రపిండాల సమస్య వచ్చిందంటే అది చాలా డేంజర్. మూత్రం సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది. అప్పుడప్పుడు ముదురు పసుపు రంగులో కూడా ఉండవచ్చు. కానీ నురుగులాగా పడుతుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. నురుగుతో కూడిన మూత్రం మీకు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది మూత్రపిండాల సమస్యకు కారణం కావచ్చు. నురుగుతో కూడిన మూత్రం ఎలాంటి వ్యాధులను సూచిస్తుందో ఇక్కడ ఇచ్చాము. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది. మూత్రం నుంచి నిరంతరం నురుగులాగా రావడం అనేది తేలికైన విషయం కాదు. ఇది ప్రోటీన్యూరియా అనే వ్యాధికి సంకేతం కావచ్చు. ప్రోటీన్యూరియా అంటే మూత్రంలో అల్బుమిన్ వంటి ప్రోటీన్ అసాధారణంగా పెరిగిపోవడం అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయడం లేదని సూచిస్తుంది. అలాగే ఏదైనా కిడ్నీల వ్యాధికి ముందస్తు సంకేతంగా కూడా భావించాలి.
ఈ లక్షణాలు కనిపించినా
మూత్రంలో నురుగుపడుతున్నప్పుడు చేతులు, కాళ్లు, ముఖం, కడుపుపై ఎక్కడైనా వాపు సమస్య వచ్చినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది మూత్రపిండాలు దెబ్బతిన్నాయని చెప్పే ప్రధాన సూచనగా చెప్పాలి. తగినంత నిద్ర లేకపోయినా కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేచాక ఏదైనా పని ప్రారంభించిన వెంటనే అలసటగా అనిపిస్తే అది మూత్రపిండాలు దెబ్బతిన్నాయని చెప్పడమే. అలాగే ఆకలి లేకపోవడం కూడా మూత్రపిండాల సమస్యకు ముందస్తు సంకేతంగానే చెప్పుకోవాలి. కిడ్నీలు ఎప్పుడైతే దెబ్బతింటాయో అప్పుడు ఆకలి సరిగా వేయదు. మూత్రం రంగులో మార్పులు కూడా మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని చెప్పడానికి ప్రధాన సంకేతంగానే చెబుతారు వైద్యులు. మూత్రం రంగులో మార్పు అంటే ముదురు పసుపు రంగులో మూత్రం పడడం అనేది ఏ మాత్రం మంచి విషయం కాదు.వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం.
వీటిని తినండి
మూత్రపిండాలఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా మీ ఆహారంలో కివి,పైనాపిల్,క్రాన్ బెర్రీ,ఆపిల్,నిమ్మ వంటి పండ్లను అధికంగా ఉండేలా చూసుకోండి.ఇవన్నీ కూడా క్రియాటినిన్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే తాజా కూరగాయలతో చేసిన వంటకాలను ఇంట్లోనే వండుకుని తినాలి. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం తగ్గించాలి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు ప్రోటీన్ అధికంగా తింటే ఆ వ్యాధి ఇంకా ముదిరిపోయే అవకాశం ఉంది.
తినకూడని ఆహారాలు
కిడ్నీల కోసం తినాల్సిన ఆహారాలే కాదు తినకూడని ఆహారాల గురించి కూడా ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఉప్పుని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై విపరీతమైన భారం పడుతుంది. కాబట్టి అధిక ప్రోటీన్ ఆహారాన్ని తగ్గించాలి. ఇక ప్రాసెస్ చేసిన ఆహారాలు పంచదారతో చేసిన పదార్థాలు కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటిని కూడా దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రతి రోజు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.