 
					Fenugreek Seeds For Hair : ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొంత మంది హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటే ఇంకొందరు హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. ఇదెలా ఉంటే మెంతులతో తయారు చేసిన హోం రెమెడీస్ జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మెంతి గింజల్లో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్, లెసిథిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి అంతే కాకుండా చుండ్రును నియంత్రించడానికి సహాయపడతాయి. మెంతులను జుట్టు పెరుగుదలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతి గింజల పేస్ట్ తయారీ: 
మెంతి గింజలను జుట్టుకు ఉపయోగించడానికి ఇది అత్యంత ముఖ్యమైన పద్ధతి.
తయారీ విధానం:
రెండు నుంచి మూడు చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం, మెత్తగా, జిగురుగా ఉండే పేస్ట్ వచ్చే వరకు వాటిని గ్రైండ్ చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ స్కాల్ప్, జుట్టుకు బాగా పట్టించండి.
కొందరికి మరింత పోషణ కోసం ఈ పేస్ట్‌లో ఒక చెంచా కొబ్బరి నూనె, పెరుగు లేదా కలబంద గుజ్జు (వంటి వాటిని కలుపుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి:
ఈ మాస్క్‌ను కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఉంచండి. షవర్ క్యాప్ ధరించడం వల్ల మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. తరువాత.. తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి.
ప్రయోజనం: ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లకు బలాన్ని ఇచ్చి, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
2. మెంతి గింజల నూనె:
మెంతి గింజలను నూనెలో కలిపి వాడడం కూడా చాలా మంచి పద్ధతి.
తయారీ విధానం:
అర కప్పు కొబ్బరి నూనె (లేదా మీకు ఇష్టమైన – ఉదాహరణకు ఆలివ్ ఆయిల్) తీసుకుని.. అందులో రెండు చెంచాల మెంతి గింజలను వేయండి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై గింజలు కొద్దిగా గోధుమ రంగులోకి మారే వరకు వేడి చేయండి. నూనె చల్లారిన తర్వాత.. గింజలను వడకట్టి, నూనెను స్టోర్ చేసుకోండి.
ఎలా ఉపయోగించాలి ?
ఈ నూనెను వారానికి కనీసం రెండు సార్లు స్కాల్ప్‌కు సున్నితంగా మసాజ్ చేయండి. ఒక గంట లేదా రాత్రంతా ఉంచుకుని, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి.
ప్రయోజనం: ఇది స్కాల్ప్‌కు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు కుదుళ్లకు లోతుగా పోషణనిచ్చి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
3. మెంతి గింజల నీరు :
మెంతి నీటిని చివరిగా జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.
తయారీ విధానం:
రెండు చెంచాల మెంతి గింజలను రెండు కప్పుల నీటిలో 10-15 నిమిషాలు మరిగించాలి.
నీరు చల్లారిన తర్వాత.. గింజలను వడకట్టి, ఆ నీటిని పక్కన పెట్టండి.
ఎలా ఉపయోగించాలి ?
మీరు షాంపూతో తలప్నానం చేసిన తర్వాత.. ఈ మెంతి నీటిని చివరిగా జుట్టు, స్కాల్ప్‌పై పోయండి. తర్వాత జుట్టును ఆరనివ్వండి.
ప్రయోజనం: ఇది సహజ కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు మెరుపును ఇస్తుంది.
Also Read: నిమ్మ Vs తులసి.. వేటిలో ఔషధ గుణాలు ఎక్కువంటే ?
ముఖ్య గమనికలు:
క్రమం తప్పకుండా వాడకం: ఉత్తమ ఫలితాల కోసం.. ఈ చిట్కాలలో దేనినైనా వారానికి 1-2 సార్లు క్రమం తప్పకుండా ఉపయోగించడం ముఖ్యం.
పేస్ట్‌ను మెత్తగా చేయండి: మెంతి పేస్ట్ పూర్తిగా మెత్తగా ఉంటే.. తల స్నానం చేసేటప్పుడు సులభంగా శుభ్రం అవుతుంది.
పరిశుభ్రత: స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడం జుట్టు పెరుగుదలకు చాలా అవసరం.
మెంతులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. జుట్టు రాలడం తగ్గి, దృఢమైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.