మన వంటింట్లో తప్పనిసరిగా ఉండే యాలకులు కేవలం వంటలకు రుచి, వాసన కోసం మాత్రమే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే సహజ ఔషధం. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగే అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ఇది చిన్న అలవాటు లాగా అనిపించినా… దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాలకుల నీరు తయారీ
యాలకుల నీరు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రాత్రి పడుకునే ముందు 2 నుంచి 3 యాలకులను తీసుకుని కొద్దిగా నలిపి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. యాలకుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగవుతుంది. చాలా మందికి ఉదయం అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఏలకుల్లో ఉండే సహజ గుణాలు జీర్ణక్రియను సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో కడుపు తేలికగా అనిపిస్తుంది.
గుండె ఆరోగ్యానికి
గుండె ఆరోగ్యానికి కూడా యాలకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. హై బీపీ ఉన్నవారు డాక్టర్ సలహాతో ఏలకుల నీరు తాగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అదనంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also read: Garlic: చిన్న వెల్లుల్లి రెబ్బతో పెద్ద ప్రయోజనాలు, రోజుకో రెబ్బ నచ్చకపోయినా నమిలేయండి
యాలకుల నీరు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారం, కాలుష్యం వల్ల శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా కాలేయం పనితీరును మెరుగుపరచి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. దీంతో రోజంతా ఫ్రెష్‌గా, ఉత్సాహంగా అనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా యాలకుల నీరు ఉపయోగపడుతుంది. ఇది మెటాబాలిజాన్ని పెంచి శరీరంలో ఫ్యాట్ వేగంగా కరిగేలా చేస్తుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గడంతో బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది.
Also read: Flax seeds: మెరిసే కురుల కోసం అవిసె గింజలను ఇలా వాడండి, అదిరిపోయే ఫలితాలు వస్తాయి
మానసిక ఆరోగ్యానికి కూడా యాలకులు మంచి ప్రభావం చూపుతాయి. వీటి సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. స్ట్రెస్, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం యాలకుల నీరు తాగడం వల్ల రోజంతా మూడ్ ఫ్రెష్‌గా ఉండే అవకాశం ఉంది. నోటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. యాలకులు నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. బ్యాక్టీరియాను తగ్గించి పళ్ళు, దవడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే చాలామంది భోజనం తర్వాత యాలకులు నమలడం అలవాటు చేసుకుంటారు.
యాలకుల నీరు ఎంత మంచిదైనా… అధికంగా తీసుకోకూడదు. ఎక్కువగా తాగితే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. కొందరికి అలర్జీ కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే బీపీ, షుగర్ వంటి సమస్యల కోసం మందులు తీసుకుంటున్న వారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగడం చాలా సులభమైన అలవాటు. కానీ దీని వల్ల జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.