Mango Pickle :సమ్మర్ లో ఇంట్లో ఎన్ని కూరలున్నా కొత్తగా పెట్టిన మామిడి పచ్చడి వేసుకోకపొతే అదో వెలితిగా ఉంటుంది. ఇక అదే మామిడి పచ్చడికి కాస్త నెయ్యి జోడించామంటే అబ్బ స్వర్గంలో తెలిపోవాల్సిందే. దాని రుచికుండే క్రేజ్ అలాంటిది మరి. అయితే చాలా ఇళ్ళల్లో పచ్చడి పెట్టిన కొన్ని నెలల్లోనే బూజెక్కడం, పచ్చడి వాసన రావడం, ముక్క మెత్తగా అయిపోవడం వంటివి కనిపిస్తుంటాయి. మరి ఇలా జరగకుండా పెట్టిన పచ్చడి ఏడాది పాటు తాజాగా అదే రుచితో ఉండాలంటే ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ఎలా పడితే అలా కాయల్ని ఎంచుకుంటే మాత్రం
మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా.. సరైన మామిడి కాయలని పట్టడం, ఎందుకంటే ఎలా పడితే అలా కాయల్ని పచ్చడికి ఎంచుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టే. అవును.. పచ్చడి పెట్టాలంటే మీరు తోతాపురి, రామకేళా, లేదా రాజాపురి వంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయడం ఉత్తమం. వీటిలో పీచు తక్కువ ఉంటుంది. దాని వల్ల ఉప్పు, కారం, నూనెతో చేసిన మసాలాని బాగా పీల్చేసుకుంటుందన్న మాట. ఇక మీరు కాయను నొక్కి చూస్తే గనుక అది మీ స్కూల్ పిల్లాడి బెంచీలా చాలా గట్టిగా ఉండాలి. అలా కాకుండా మెత్తగా ఉందొ మీ పచ్చడి పాడైనట్టే. సో గట్టి కాయని పట్టాల్సిన బాధ్యత మీదే. ఇక కాయల్ని పచ్చడికి సిద్ధం చేసే ప్రాసెస్ లో భాగంగా కాయలను కనీసం ఒక గంట పాటు నీళ్లలో నానబెడితే మంచిది. దీని వల్ల కాయలో ఉండే వేడి తగ్గి పచ్చడి రుచిగా ఉంటుందన్న మాట.
నెలరోజులకే పాడవటం పక్కా.
ఆ తర్వాత నీళ్లలో నుండి తీసిన మామిడికాయలని మంచి కాటన్ బట్టతో శుభ్రంగా తుడవాలి. మీరు గనుక మామిడి కాయలని తుడవడంలో అశ్రద్ధ వహించి తడి ఉండేలా ఆదరా బాదరా తుడిచి పక్కన పెడితే మాత్రం మీ పచ్చడి నెలరోజులకే పాడవటం పక్కా. ఇక తుడిచిన కాయలని ఫ్యాన్ కింద లేదా ఎండలో కనీసం రెండు గంటల పాటు ఆరబెడితే తడి అంతా పోయి పచ్చడికి అనుకూలంగా ఉంటాయి.
ఇక ముక్కలు కొట్టిన తర్వాత కూడా వాటిని తడికి దూరంగా ఉంచడం ఉత్తమం. అన్నింటి కన్నా ముఖ్యంగా మామిడి ముక్కలకి ఉండే జీడి తీసేయ్యాలి. అలా కాకుండా జీడిని గనుక మర్చిపోయారంటే మీరు రుచికరమైన పచ్చడిని మర్చిపోవాల్సిందే.
also read: 9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!
నూనెని పచ్చడిలో సరిగ్గా కలపడం అనేది ఒక ఆర్ట్
ఇక పచ్చల్లకి ముఖ్యంగా కావాల్సింది నూనె. ఇది కలిపితేనే పచ్చడికి అసలైన రుచి వచ్చేది. ఆ నూనెని పచ్చడిలో సరిగ్గా కలపడం అనేది ఒక ఆర్ట్. ముందుగా నూనెని బాగా వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నూనె చల్లారిన తర్వాత పచ్చడికి పట్టించాలి. ఇలా చేస్తే నూనెలో పచ్చి దనం పోతుంది.ఇక పచ్చడిలో నూనె ఎలా ఉండాలంటే జాడీలో పచ్చడి పెడితే నూనె పై వరకు తేలుతూ ఉండాలి. అప్పుడే నూనె పచ్చడికి ఎలాంటి ఫంగస్ బ్యాక్టీరియా పట్టకుండా కాపాడుతుంది.
ఇక పచ్చడిలో కలిపే మసాలాల విషయానికి వస్తే బయట ఆవపిండిని కొనకుండా ఇంట్లో స్వయంగా చేసుకుంటే ఉత్తమం. దాని వల్ల కల్తీ లేని సువాసన గల పచ్చడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆవాలను ఎండబెట్టి పొడి చేసే కన్నా దోరగా వేయించి పొడి చేస్తే చాలా మంచిది.
కల్లుప్పు వాడితే బెటర్
ఇక మార్కెట్ లో దొరికే నాసిరకం ఉప్పుని కాకుండా కల్లుప్పు వాడితే బెటర్. దీని వల్ల పచ్చడి కి లైఫ్ టైం ఎక్కువ. ఇక పచ్చడి పెట్టుకున్న ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించి ఒకటి రెండు రోజులు ఎండలో ఉంచడం మర్చిపోవద్దు. దీని వల్ల ముక్కల్లో పదన, తడి ఏమాత్రం ఉన్నా ఎగిరిపోతుంది.
ఇక పచ్చడిని నిల్వ చేయడానికి కక్కుర్తి పడి చీప్ గా దొరుకుతున్నాయి గా అని ప్లాస్టిక్ వాటిల్లో కుక్కకుండా గాజు సీసాలు లేదా మట్టి జాడీలని వాడితే చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ జాడీలని లేదా గాజు సీసాలని వాడే ముందు వేడి నీటితో కడిగి, ఎండలో బాగా ఎండబెట్టడం అస్సలు మర్చిపోవద్దు.
పచ్చడిని మరింత కాలం నిల్వ
ఇక పచ్చడి జాడీలో పెట్టే ముందు దాని అడుగున కాస్త ఇంగువ పొడి చల్లితే మేలు. ఎందుకంటే అది యాంటీ-సెప్టిక్‌లా పనిచేసి పచ్చడిని మరింత కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. ఇక చాలా మంది చేసే తప్పు ఏంటంటే పచ్చడి తీసేందుకు తడి స్పూన్ ని వాడుతుంటారు. ఇలా చేస్తే పచ్చడి బూజుపాలవడం ఖాయం. సో… తడి లేని స్పూన్ పెట్టండి, పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూసుకోండి.
మరి మీ ఇంటిలో పచ్చళ్ళు పెడితే ఈ చిట్కాలు ఫాలో అవుతారు కదూ!
also read: ఏడాది తర్వాత ఓటీటీలోకి బర్నింగ్ స్టార్.. సంపూ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?