ఆరోగ్యానికి పాలు, పాల ఉత్పత్తులు తాగాల్సిందే. అయితే పాలు ఎక్కువగా తాగడం వల్ల మెదడుకు సంబంధించిన ‘పార్కిన్సన్స్’ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో న్యూరాలజిస్టులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. పాల వినియోగం వల్ల మెదడులోని నాడీ కణాలు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా వయసు పెరిగే కొద్దీ శరీర నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పరిశోధనల్లో తేలిన వాస్తవాలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం దాదాపు 25 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. రోజుకు మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకునే వారికి పార్కిన్సన్స్ వచ్చే ముప్పు 34 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిర్వహించిన మరో అధ్యయనంలో, ఈ ముప్పు పురుషులలో 1.8 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. స్త్రీల కంటే పురుషులపైనే పాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పాలు అమృతం లాంటివి అనుకునే మనకు ఈ ఫలితాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.
Also read: Hot Water: ఈ వస్తువులను వేడినీళ్లతో శుభ్రం చేస్తే అంతే సంగతులు, పాడపోవడం గ్యారెంటీ
అసలు కారణాలు ఏమిటి?
పాల వల్ల పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందనే దానిపై శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు. పాడి పశువులకు ఇచ్చే మేతపై చల్లే పురుగుమందుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి చేరడం ప్రధాన కారణం కావచ్చు. ఈ రసాయనాలు మెదడులోని ‘సబ్‌స్టాంటియా నిగ్రా’ అనే భాగంలోని నాడీ కణాలను క్రమంగా నిర్జీవం చేస్తాయి. దీనివల్ల డోపమైన్ అనే రసాయన ఉత్పత్తి తగ్గి పార్కిన్సన్స్ వ్యాధికి దారి తీస్తుంది. అలాగే పాలలోని గెలాక్టోస్ అనే చక్కెర పదార్థం మెదడులో వృద్ధాప్య ఛాయలను త్వరగా తీసుకువస్తుందని, ఇది నాడీ సంబంధిత సమస్యలకు మూలమవుతుందని వైద్యులు భావిస్తున్నారు.
పార్కిన్సన్స్ లక్షణాలు
ఈ వ్యాధి కేవలం వృద్ధులలోనే కాకుండా, ఇప్పుడు 50 ఏళ్ల లోపు వారిలో కూడా కనిపిస్తోంది. చేతులు లేదా కాళ్లు వణకడం, నడకలో తడబాటు, శరీరం బిగుసుకుపోవడం, కదలికలు మందగించడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. అయితే ఇవి కనిపించడానికి ముందే మలబద్ధకం, వాసన పసిగట్టలేకపోవడం, నిద్రలో ఇబ్బందులు, తరచూ మూడ్ స్వింగ్స్ రావడం వంటి ముందస్తు సంకేతాలు కనిపిస్తాయి. మన దేశంలో ప్రతి లక్ష మందిలో సుమారు 40 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ సాదిక్ పఠాన్ వంటి నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పరిశోధనల ఫలితంగా పాలు తాగడం పూర్తిగా మానేయాల్సిన పని లేదు, కానీ ‘అతి’గా తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా తక్కువ కొవ్వు ఉండే ‘స్కిమ్డ్ మిల్క్’ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలతో పాటు బాదం, ఆకుకూరలు వంటి ఇతర క్యాల్షియం వనరులను అలవాటు చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.