కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఇది ఒక్కటే 500 కంటే ఎక్కువ పనులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరం మొత్తం మూల పడిపోతుంది. కానీ ఆధునిక జీవనశైలిలో ఏది పడితే అది తినడం వల్ల కాలేయంలో తీవ్రంగా మురికి పేరుకుపోతుంది. ఇది కాలేయ పనితీరును ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మీరు తినే కొన్ని ఆహారాలు కాలేయాన్ని చెత్త డబ్బాలా మార్చేస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఆహారాన్ని తినడం మానేయాలో తెలుసుకోండి.
మద్యం
ఆల్కహాల్ కాలేయానికి ఎంతో ప్రమాదకరమైనది. ఎక్కువగా ఆల్కహాల్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య అలాగే హెపటైటిస్, సిర్రోసిస్, కాలేయ వైఫల్యం వంటి సమస్యలు సంభవిస్తాయి. కాబట్టి ఆల్కహాల్ అలవాటును చాలా వరకు తగ్గించుకోవడమే మంచిది.
ఇలాంటి పదార్థాలు
శుద్ధి చేసిన పిండితో చేసిన ఆహారాలు అంటే మైదాతో చేసిన ఆహారాలు, నూనెలో వేయించిన పదార్థాలు అధికంగా తింటే కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడాలు, బర్గర్లు వంటివి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. నూనెతో కూడిన ఈ ఆహారాలన్నీ కూడా కాలేయంలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు పేరుకుపోవడానికి కారణం అవుతాయి. ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కూడా కారణం కావచ్చు.
మాంసాహారం తగ్గించండి
మాంసాహారం తినడం కొంతవరకు ఆరోగ్యమే. కానీ అతిగా తింటే మాత్రం కాలేయానికి ఇబ్బంది తప్పదు. కాలేయం నాన్ వెజ్ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మటన్, బీఫ్, రెడ్ మీట్ వంటివి జీర్ణం చేసుకోలేదు. ఆ ఆహారాలలో అధిక సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. దీనివల్ల కాలేయంలో ఇన్ఫ్లమేషన్ రావచ్చు. లేదా కొవ్వు పేరుకుపోవచ్చు. ఇది భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు.
స్వీట్లు
శీతల పానీయాలు కేకులు, కుకీలు, జ్యూస్‌లు, స్వీట్లు వంటివన్నీ కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవేవీ కూడా కాలేయానికి ఆరోగ్యకరం కాదు. ఈ పానీయాలలో ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీని వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. వీటిని అధికంగా తినే వారికి భవిష్యత్తులో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం అధికమే.
ఉప్పు తగ్గించుకోండి
పైన చెప్పిన ఆహారాలతో పాటు ఉప్పు వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. ఉప్పు అధికంగా వాడితే కాలేయానికి ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా చిప్స్, పిజ్జా, నూడుల్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ లో ఉప్పు అధికంగా ఉంటుంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ ఉప్పు ట్రాన్స్ ఫ్యాట్స్ కలిసి కాలేయానికి హాని కలిగిస్తాయి. ప్రోటీన్, విటమిన్స్, సప్లిమెంట్లు కూడా తీసుకోకూడదు. ఇవి కూడా కాలేయంపై ఒత్తిడి పడేలా చేస్తాయి. మీకు ప్రోటీన్, విటమిన్లు కావాలంటే పండ్లు, కూరగాయలు తినడం ద్వారానే వాటిని పొందాలి. అంతే తప్ప కృత్రిమ పద్ధతిలో ఇలా సప్లిమెంట్ల రూపంలో తీసుకోకూడదు.