Pattu Saree: చిన్న ఫంక్షన్‌కు వెళ్తున్నా.. ఏదైనా శుభకార్యమైనా.. పెళ్లిళ్లు.. పూజలు ఇలా.. సందర్భం ఏదైనా సరే పట్టుచీరలు కట్టాల్సిందే. అంతేకాదు.. మంచి డిజైన్ ఉన్న పట్టుచీరల కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అమ్మాయిల నుంచి అమ్మల వరకూ అందరూ మెచ్చేవి ఈ పట్టుచీరలే. అయితే, వీటిని అంతే జాగ్రత్తగా చూసుకోకపోతే తొందరగా పాడైపోతాయని చెబుతున్నారు నిపుణులు. అలాకాకుండా.. ఏళ్లతరబడి పట్టు వస్త్రాల మన్నిక, మెరుపు బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
పట్టు చీరలను వీలైనంత వరకూ డ్రై క్లీనింగ్ చేయించటమే ఉత్తమమైన మార్గం. ఎప్పుడైనా ఇంట్లోనే వాష్ చేయానుకుంటే.. చల్లటి నీటిలో మైల్డ్ షాంపూ, కుంకుడుకాయల రసం, సిల్క్ డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలని చెబుతున్నారు నిపుణులు. అయితే, ఎట్టిపరిస్థితిల్లోనూ బ్రష్ వాడొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పట్టువస్త్రాల రంగు పోకుండా ఉండటానికి, ఫస్ట్‌టైం ఉతికేటప్పుడు నీళ్లల్లో కాస్త వెనిగర్ కలపడం మరిచిపోవద్దు.
పట్టు వస్త్రాలు కట్టిన ప్రతిసారీ.. ఉతకవద్దని, గాలికి ఆరనిచ్చి జాగ్రత్తగా మడతబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పట్టు చీరల్ని మరో రెండు లేదా మూడు సార్లయినా.. కట్టుకున్నాకే వాష్ చేయాలని పేర్కొన్నారు. అయితే, పట్టు శారీస్‌ను నేరుగా ఎండలో కాకుండా.. నీడలో గాలి బాగా వచ్చే ప్రదేశంలో ఆరేయాలని సలహా ఇస్తున్నారు.
పండగలప్పుడో లేదా ఫంక్షన్లప్పుడో కట్టుకోవాలనుకున్నప్పుడు.. ముడతలు పడిన పట్టు శారీస్‌ని తక్కువ ఉష్ణోగ్రతల్లో ఇస్త్రీ చేయాలని, చీర మీద నేరుగా ఇస్త్రీ పెట్టే పెట్టకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వస్త్రాలపై ఏదైనా కాటన్ వస్త్రం పరిచి ఐరన్ చేస్తే మంచిదని, ముఖ్యంగా జరీ, ఎంబ్రాయిడరీ ఉన్న చోట వేడి ఎక్కువైతే అవి కాలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
పట్టు శారీస్‌ను వాస్ చేసిన తర్వాత నేరుగా బీరువాలో పెట్టేయకుండా.. మస్లిన్ వస్త్రం లేదా పొడి కాటన్‌లోనే భద్రపరచాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా, నేరుగా బీరువాలో పెడితే కీటకాలు పాడు చేస్తాయని, ప్లాస్టిక్ కవర్లలో పెడితే తేమ ఏర్పడి చీర దెబ్బతినొచ్చనని సూచిస్తున్నారు. అందుకే, ఏదైనా చిన్న వస్త్రంలో లవంగాలను లేదా నాఫ్తలీన్ గోళీలను ఉంచితే సరిపోతుంది. అలాగని నెలల తరబడి సిల్క్ చీరల్ని ఒకే మడతల్లో ఉంచొద్దని, అలాగే ఉండటం వల్ల చిరిగిపోయే ప్రమాదం ఉందని.. తరచూ వాటిని మారుస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.