Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ బైక్ లను ఢీకొని, వ్యాపారులపైకి దూసుకెళ్లింది. టాటా ఏస్ వాహనం, మూడు బైకులు ఢీ కొట్టి, ఆపై చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెన్నై నుంచి కోల్ కతా వైపు చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ అతి వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారాలపై దూసుకెళ్లింది. ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిబంధనల మేరకు ఇక్కడ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అయితే అతి వేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కనున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Andhra Pradesh: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి
“నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానం వద్ద హైవేపై ఘోర ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిత్యం నేను రాకపోకలు సాగించే మార్గంలో ఈ దారుణం జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. మొక్కజొన్న కంకులు అమ్ముకునే వారితో పాటు వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిపైకి లారీ దూసుకెళ్లడం బాధాకరం. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, తీవ్రగాయాలపాలైన వారు క్షేమంగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను”- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి