Dog Bite Precautions: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెట్స్‌ను పెంచుకుంటున్నారు. అందులోనూ కుక్కల్ని పెంచుకోవడం, వాటితో కలిసిమెలసి జీవించడం వేలఏళ్ల క్రితమే మనిషి మొదలుపెట్టాడట. పెట్స్‌ను మచ్చిక చేసుకోవడం ద్వారా రెండు జాతుల మధ్య గట్టి బంధం ఏర్పడింది. అయితే, కొన్నిసార్లు కుక్కలు ఆకలితోనో, నిస్సహాయతలోనో క్రూరంగా ప్రవర్తిస్తాయి. ఈ క్రమంలో వాటి ప్రవర్తనపై పూర్తి అవగాహన అవసరమంటున్నారు నిపుణులు. రోడ్డుపై తీరికగా నడుస్తున్నప్పుడు అనుకోకుండా కుక్కలు మన వెంటపడుతుంటాయి. అలాంటి సమయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో కుక్కలు మన వెంట పడితే.. ఏం చేయాలో నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. అవేంటంటే..
మనం దారిలో నడుస్తున్నప్పుడు.. వీధి కుక్కలు మన వెంట పడినప్పుడు కుక్కల కళ్లలోకి చూడకూడదని, అలా చూస్తే అవి మరింత రెచ్చిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే.. మనం ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నట్టు భావించి మీదకొస్తాయని తెలిపారు. అలాగే, కుక్క వెంట పడింది కదా అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదట. స్తబ్దుగా నిలబడి ఉండాలని, అప్పుడు వాసన చూసి వెళ్లిపోతాయని తెలిపారు.
కుక్కలు దాడి చేయడానికి వచ్చినప్పుడు చేతుల్లో ఉన్న వస్తువుల్ని అడ్డుపెట్టుకుని కరవకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ కుక్కలు వాహనాల వెనకాల పడుతున్నప్పుడు స్పీడ్ పెంచకూడదని, అలాగని సడన్ బ్రేక్ వేయవద్దు. అలాచేస్తే.. కుక్క ప్రిడేటర్ మోడ్‌లోకి వెళ్తుందని, దీంతో కరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే, నిదానంగా స్లో చేస్తూ ఆగి, వాటిని గద్దించి భయపెట్టాలని సలహా ఇస్తున్నారు.
వీధి కుక్కలైనా, ఇంట్లో కుక్కలైనా కరిచినా, గీరినా వెంటనే ఆ భాగాన్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద సబ్బుతో పది నిమిషాలు శుభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. కుక్క కరిచిన 24 గంటల్లో టీటీ, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో నాటు మందులు తీసుకోకూడదని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.