Gadwal Murder Case: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు బానిసై అప్పులు చేశాడో యువకుడు. ఆ అప్పులు తీర్చేందుకు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును చోరీ చేశాడు. చోరీ వ్యవహారంలో మహిళను హత్య చేయడం జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన పై ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసైన కళ్ల రామిరెడ్డి అనే యువకుడు గద్వాలలోని తన పెదనాన్న ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసిస్తున్నాడు. ఆ ఇంటి కింది భాగంలో లక్ష్మీ (55) కుటుంబం ఉంటుంది. అద్దె వసూలు చేసి పెద్దనాన్న ఇస్తుంటే వాడు రామిరెడ్డి. ఈ క్రమంలో లక్ష్మీతో రామిరెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రామిరెడ్డి లక్ష్మీ వద్ద బంగారం, తన స్నేహితుల దగ్గర నగదు అప్పుచేసి ఆన్ లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాడు.
లక్ష్మీ అనే మహిళ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. ఆమె దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని అప్పులు తీర్చేయాలని నిర్ణయించుకున్నాడు రామిరెడ్డి. ఈ క్రమంలో ఈ నెల రెండో తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్ష్మీ ఇంటికి వెళ్లాడు యువకుడు. ఆమెను డబ్బులు అడగగా ఇప్పుడు తన వద్ద లేవని కొంచెం టైం పడుతుందని చెప్పింది. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని, ఎలాగైనా ఇవ్వాలని ఆమెను బలవంతం పెట్టాడు. లక్ష్మీ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును చూసి ఎలాగైనా ఆమెను చంపి ఆ గొలుసును దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారు పుస్తెలతాడు చోరీ చేసి పరారయ్యాడు.
నిందితుడి చిన్ననాటి స్నేహితుడైన ఉమేష్ కు శంషాబాద్ లో గోల్డ్ షాప్ ఉంది. బంగారు పుస్తెలతాడును తన భార్య నానమ్మదని చెప్పి దానిని కరిగించి ఇవ్వాలని కోరాడు. దానితో తన భార్యకు, కొడుకుకు చైన్ చేయించాలని మిత్రుడిని నమ్మించాడు. రామిరెడ్డి మాటలు నమ్మిన అతడు బంగారాన్ని కరిగించి బిస్కెట్ గా మార్చి ఇచ్చాడు. ఆ బంగారాన్ని రామిరెడ్డి హైదరాబాద్ లోని ఉప్పరగూడలో అమ్మగా రూ.5 లక్షల 60 వేలు వచ్చాయి. ఆ డబ్బులో కొంత తన ఖర్చులకు వాడుకొని భార్యకు ఇయర్ రింగ్స్ చేయించి, కొత్త బట్టలు తీసుకున్నాడు. మిగిలిన 1.33 లక్షల రూపాయలను తన స్కూటీలో పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న లక్ష ఇరవై వేల రూపాయలను అప్పు కట్టేశాడు. తాకట్టులో ఉన్న తన భార్య బంగారాన్ని విడిపించేందుకు 1.65 లక్షలు కట్టాడు.
మృతురాలి భర్త మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మృతురాలు ఇంటికి వచ్చే వారి వివరాలను సేకరించారు. లక్ష్మీ ఎవరెవరికి డబ్బులు వడ్డీలకు ఇచ్చేది ఎవరెవరు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడేవారని ప్రత్యేక దృష్టిపెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రామిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి డబ్బు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామిరెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.