ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మరణాలకు కారణమవుతున్న వ్యాధుల జాబితాను విడుదల చేసింది. వాటిలో టాప్ టెన్ వ్యాధులను గుర్తించింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 68 మిలియన్ల మంది మరణిస్తే అందులో 57 శాతం మంది కేవలం 10 వ్యాధుల వల్లే మరణించారు. వాటిలో అతి ముఖ్యమైనది, మొదటి స్థానంలో ఉన్నది ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్.
ఇస్కిమిక్ గుండె వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న మరణాలలో 13 శాతం దీనివల్లే సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. 2021 సంవత్సరంలో ఈ వ్యాధులు కారణంగా 91 లక్షల మంది మరణించారు. ఆ ఏడాది కోవిడ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే 2021లో కోవిడ్ కారణంగా 8 లక్షల మరణాలు సంభవిస్తే… ఇస్కీమిక్ గుండె వ్యాధుల వల్ల దానికి పది రెట్ల మరణాలు సంభవించాయి.
ఒక నివేదిక చెబుతున్న ప్రకారం ప్రతి ఏటా కోటిన్నర మందికి పైగా ఇస్కీమిక్ గుండె జబ్బుల వల్లే మరణిస్తున్నట్టు తెలుస్తోంది.
అత్యంత ప్రాణాంతక వ్యాధుల జాబితా ఇక్కడ ఇచ్చాము.
1. ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్
2.కోవిడ్ 19
3. స్ట్రోక్
4. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
5. ఊపిరితిత్తుల క్యాన్సర్
6.అల్జీమర్స్
7. డయాబెటిస్
8. కిడ్నీ వ్యాధులు
9. టిబి
10. ఎయిడ్స్
ఇస్కిమిక్ గుండె జబ్బు అంటే ఏమిటి
ఇస్కిమిక్ గుండె జబ్బులు అంటే గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల అది బలహీనపడుతుంది. సాధారణంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇది జరుగుతుంది. ధమనుల్లో అడ్డంకులు పేరుకుపోయి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల ఇస్కిమిక్ గుండె జబ్బులు బారిన పడతారు. ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి ఛాతి నొప్పి నుండి గుండెపోటు వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ముందుగానే గుర్తిస్తే యాంజియోప్లాస్టి, ఆపరేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. అలాగే జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తినే ఆహారంపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి.
గుండెను బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే ప్రతిరోజు అరగంట నుండి గంట వరకు తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి. ప్రతిరోజు పావుగంటసేపు మీరు వ్యాయామం చేసినా చాలు గుండె జబ్బుల బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గించుకుంటారు.
ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ లక్షణాలు
ఇస్కీమిక్ గుండె జబ్బులు వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారవచ్చు. అందరికీ ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. కానీ ఇస్కిమిక్ గుండె జబ్బుల్లో కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఛాతీ నొప్పి లేదా ఛాతీ దగ్గర అసౌకర్యంగా అనిపించడం. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, కాలు నొప్పి పెట్టడం, లేదా కాలిలో అసౌకర్యంగా అనిపించడం, గుండె దడ ఇవన్నీ కూడా జబ్బును సూచిస్తాయి.
ఈ గుండె జబ్బు రావడానికి అనేక కారకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అధిక రక్తపోటు. రక్తపోటు అదుపులో లేని వారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయినా కూడా ఈ గుండె జబ్బు త్వరగా వస్తుంది. ధూమపానం చేసేవారిలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉబకాయంతో బాధపడుతున్న వారికి కూడా ఈ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వ్యాయామం తక్కువగా చేసే వారికి, శారీరక శ్రమ లేని వారికి కూడా ఇది వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
ఇస్కిమిక్ గుండె జబ్బు వచ్చిందో లేదో నిర్ధారించడానికి వైద్యులు మొదటగా ఈసీజీ తీస్తారు. తర్వాత ఎక్సో కార్డియోగ్రామ్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే కార్డియాక్ కేథరైజేషన్ వంటి పరీక్షలు కూడా చేస్తారు.