Monsoon Infections Pregnancy| వర్షాకాలం అంటే అందరికీ ఇష్టం. వర్షాలు కురవడంతోనే అందరూ ఉత్సహాంగా వర్షాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే వేడి వాతావరణం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, వర్షాకాలంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఈ సమయంలో తేమ వల్ల బ్యాక్టీరియా, దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతాయి. ముఖ్యంగా గర్భవతులైన మహిళలు ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గర్భవతులకు రోగనిరోధక శక్తి కొంత బలహీనంగా ఉంటుంది. చెన్నైలోని అపోలో క్రాడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో సీనియర్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అముదా హరి.. గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఇన్ఫెక్షన్ల గురించి వివరించారు. ఈ ఇన్ఫెక్షన్లు, వాటిని నివారించే మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. డెంగ్యూ
డెంగ్యూ ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. డెంగ్యూ వల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది. దోమల నుండి రక్షణ పొందడం ద్వారా దీనిని నివారించవచ్చు.
2. మలేరియా
వర్షాకాలంలో మలేరియా కూడా ఒక ప్రధాన సమస్య. మలేరియా గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. గర్భవతులు సాధారణంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు రక్తహీనత ఉంటుంది. అయితే మలేరియా సోకగానే రక్తహీనత తీవ్రమవుతుంది. శిశువు బరువు తక్కువగా ఉండటానికి కారణమవుతుంది. దోమల నుండి రక్షణ, శుభ్రమైన నీటిని ఉపయోగించడం ద్వారా దీనిని నివారించవచ్చు.
3. లెప్టోస్పిరోసిస్ (Leptospirosis)
ఈ ఇన్ఫెక్షన్ జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం లేదా శరీర అవయవ సమస్యలను కలిగిస్తుంది. శుభ్రమైన వాతావరణంలో ఉండటం ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను నివారించవచ్చు.
4. టైఫాయిడ్ జ్వరం
వర్షాకాలంలో పరిశుభ్రత లేకపోవడం వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలలో అధిక జ్వరం, ఇతర సమస్యలను కలిగిస్తుంది. శుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.
5. హెపటైటిస్ A, హెపటైటిస్ E
హెపటైటిస్ A, E వైరస్‌లు అపరిశుభ్రమైన పరిస్థితులలో వ్యాపిస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ E గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. ఇది గర్భ నష్టం లేదా కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. శుభ్రమైన నీటిని తాగడం, ఆహారాన్ని జాగ్రత్తగా వండుకోవడం చాలా ముఖ్యం.
6. గ్యాస్ట్రోఎంటరైటిస్ (Gastroenteritis)
ఈ ఇన్ఫెక్షన్ గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గడానికి, పోషకాల కొరతకు దారితీస్తుంది. శుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.
7. ఫంగల్ ఇన్ఫెక్షన్
గర్భిణీ స్త్రీలు హార్మోన్ల మార్పుల వల్ల చర్మ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. శరీరాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
ఈ ఇన్ఫెక్షన్లను నివారించే మార్గాలు
వ్యక్తిగత పరిశుభ్రత: గర్భిణీ స్త్రీలు ఫ్లూ, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి పరిశుభ్రత పాటించాలి. రెగ్యులర్‌గా చేతులు కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం ముఖ్యం.
శుభ్రమైన ఆహారం: కాయగూరలు, పండ్లను బాగా కడిగి తినాలి. రోడ్డు పక్కన విక్రయించే నీరు లేదా ఆహారం తీసుకోవడం మానేయాలి, ఎందుకంటే ఇవి విరేచనాలు లేదా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.
నీటి నిల్వ: బకెట్లు లేదా కుండలలో నీటిని నిల్వ చేయకూడదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దీనివల్ల దోమల నుండి రక్షణ పొందవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం: విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే, తగినంత విశ్రాంతి తీసుకోవడం. ఎక్కువ నీరు తాగడం కూడా చాలా ముఖ్యం.
Also Read: మతిమరుపు, అల్జీమర్స్‌కు ఇవే కారణాలు.. మెదడు ఆరోగ్యానికి ప్రమాదకరం..
వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.