Heart Attack Symptoms In Women: గుండెపోటు అనేది స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ప్రాణాంతకమైన సమస్య అయినప్పటికీ.. మహిళల్లో దాని లక్షణాలు తరచుగా పురుషుల కంటే భిన్నంగా.. సూక్ష్మంగా ఉంటాయి. ఈ తేడా కారణంగా.. మహిళల్లో గుండెపోటును గుర్తించడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఇది చికిత్సకు ఆటంకం కలిగించి ప్రాణాపాయాన్ని పెంచుతుంది. ఆరోగ్య నిపుణులు మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన.. తరచుగా నిర్లక్ష్యం చేసే గుండెపోటు లక్షణాలను వెల్లడించారు.
సాధారణంగా గుండెపోటు అంటే.. ఛాతీ మధ్యలో పదునైన నొప్పి, ఎడమ చేయికి నొప్పి వ్యాపించడం వంటి సంకేతాలు గుర్తుకు వస్తాయి. అయితే.. మహిళల్లో ఈ లక్షణాలు చాలా తేలికగా లేదా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల్లో నిర్లక్ష్యం చేసే.. గుండెపోటు లక్షణాలు:
తీవ్రమైన, అసాధారణమైన అలసట : గుండెపోటు వచ్చే వారాలు లేదా రోజుల ముందు అసాధారణమైన అలసట లేదా తీవ్రమైన నిస్సత్తువ కలగడం మహిళల్లో అత్యంత సాధారణమైన, కానీ తరచుగా నిర్లక్ష్యం చేసే లక్షణం. విశ్రాంతి తీసుకున్నా కూడా ఈ అలసట తగ్గకపోవచ్చు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా శక్తి లేనట్లు అనిపించవచ్చు.
శ్వాస ఆడకపోవడం : ఎటువంటి శారీరక శ్రమ చేయకుండానే శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం లేదా ఆయాసం రావడం గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ఈ లక్షణం ఛాతీ నొప్పి లేకుండా కూడా వస్తుంది.
ఎగువ శరీర భాగాలలో అసౌకర్యం: గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి కేవలం ఛాతీకి మాత్రమే పరిమితం కాకుండా.. మెడ, దవడ , భుజాలు , వీపు లేదా పొట్ట వంటి ప్రాంతాలలో కూడా అసౌకర్యం, నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. ఈ నొప్పి ఏ ఒక్క కండరానికో లేదా కీలుకో సంబంధం లేని విధంగా అనిపించవచ్చు.
జీర్ణ సమస్యలు: కొంతమంది మహిళల్లో వికారం, వాంతులు, అజీర్ణం లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలు గుండెపోటుకు ముందు సంకేతాలుగా కనిపించవచ్చు. వీటిని తరచుగా గ్యాస్ లేదా సాధారణ కడుపు సమస్యలుగా పొర బడుతుంటారు.
చల్లని చెమటలు లేదా తల తిరగడం: ఆకస్మికంగా చల్లని చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం లేదా మూర్ఛ వచ్చేలా అనిపించడం గుండెపోటు సూక్ష్మ సంకేతాలు.
నిద్రలో ఆటంకాలు: కొందరిలో గుండెపోటుకు ముందు వారాల్లో నిద్ర సమస్యలు, రాత్రిపూట ఆకస్మికంగా మెలకువ రావడం వంటివి జరుగుతాయి.
ఛాతీలో నొప్పి: పురుషులలో లాగా తీవ్రమైన నొప్పి కాకుండా.. మహిళలు తరచుగా ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతు లేదా బరువు ఉన్నట్లుగా ఉండే అసౌకర్యాన్ని మాత్రమే అనుభవిస్తారు.
Also Read: ఉసిరి ఇలా తింటే.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ !
ఆలస్యం ప్రాణాంతకం:
మహిళల్లో గుండెపోటు లక్షణాలు అంత స్పష్టంగా లేకపోవడం వల్ల వారు వాటిని ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర చిన్నపాటి అనారోగ్యాలుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఎక్కువ. దీనివల్ల చికిత్స ఆలస్యమై, గుండె కండరాలకు శాశ్వత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
డాక్టర్‌ని సంప్రదించండి:
మీరు లేదా మీ చుట్టూ ఉన్న మహిళలు పైన పేర్కొన్న లక్షణాలలో దేనినైనా ఆకస్మికంగా అనుభవిస్తే అవి గుండెపోటు సంకేతాలు కావచ్చని గుర్తుంచుకోండి. ఛాతీ నొప్పి లేకపోయినా.. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణమే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. ఏ చిన్న అనుమానం ఉన్నా.. ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి, మీ లక్షణాల గురించి పూర్తి వివరాలు తెలియజేయడం ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత అవసరం.