Banana Side Effects: సాధారణంగా అరటిపండును తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన పండ్లలో ఒకటిగా చెప్తుంటారు. పొటాషియం, మెగ్నీషియం, పీచుపదార్థాలు (ఫైబర్) మెండుగా ఉండే ఈ పండును చాలామంది రోజూ తింటుంటారు. అయితే, అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటే మాత్రం అది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరటిపండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అది అరగడానికి కాస్త సమయం పడుతుంది. పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పల్చగా మారుతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించి, తిన్న ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా కడుపు భారంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల చాలామందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణశక్తి ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా సాగకపోవడం వల్ల అరటిపండులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేకపోతుంది.
Also Read: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? పరగడుపున ఈ ‘మ్యాజిక్ వాటర్’ తాగండి చాలు!
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు తిన్న వెంటనే, ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. ఈ కలయిక వల్ల శరీరంలో కఫం పెరిగిపోతుంది. దీనివల్ల గొంతు కిరకిరమనడం, దగ్గు, జలుబు లేదా రొంప వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణం మారినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
ఏ పండు తిన్నా వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని, ముఖ్యంగా అరటిపండు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు ఆగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అంతగా దాహంగా అనిపిస్తే.. ఫ్రిడ్జ్ నీళ్లకు దూరంగా ఉండి గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని కొద్దిగా తీసుకోవడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటేనే అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
Also Read: కాకరకాయ గింజలను పారేస్తున్నారా? ఈ హెల్త్ సీక్రెట్స్ తెలిస్తే కళ్లకు అద్దుకుని తింటారు!