Sleeping Health Benefits: నిద్ర మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఒక వ్యక్తి శరీరం, మనసు, మెదడు సమతుల్యంగా పనిచేయడానికి మంచి నిద్ర తప్పనిసరి. చాలా సార్లు మనం ఇంట్లోనూ, బయటా నిద్రపోతున్న వారిని ఒక్కసారిగా గట్టిగా పిలిచి లేదా ఊపిరి పీల్చుకునేంత శబ్దం చేస్తూ లేపుతుంటాం. కానీ మీకు తెలుసా? ఇలాంటి హఠాత్తుగా లేపడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పులు ఉన్నాయట.
శరీరం పై ప్రభావం
నిద్రలో మన శరీరం వేర్వేరు దశల్లోకి వెళ్తుంది. వాటిలో ఒక దశలో మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంటే, మరొక దశలో మెదడు సమాచారం సేకరించి, జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా లేపేస్తే మెదడులో హఠాత్తుగా జరిగే మార్పులు శరీరంపై ఊహించని ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా హృదయ స్పందన స్థాయి ఒక్కసారిగా పెరగడం, రక్తపోటు ఎక్కువకావడం, ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకపోవడం జరుగుతాయి.
ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, పరిశోధనల ప్రకారం నిద్రలోని “డీప్ స్లీప్” దశలో ఉన్నప్పుడు ఒక్కసారిగా లేపితే కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు నష్టం కలిగే అవకాశముంటుందట. ఎందుకంటే ఆ సమయంలో మెదడు రక్తప్రసరణ, నాడీ సంబంధిత పనులు సున్నితంగా జరుగుతుంటాయి. ఈ దశలో జరిగే అంతరాయం మెదడు పనితీరును దెబ్బతీయగలదు.
ఇలాంటివి ఒక్కసారిగా జరగవు, కానీ తరచూ చేస్తే పెద్ద ప్రమాదం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, హృదయ సమస్యలతో బాధపడుతున్నవారిని ఇలా ఒక్కసారిగా లేపడం చాలా ప్రమాదకరం. వారి మెదడు, హృదయానికి ఇది తీవ్రమైన షాక్ లాంటిది.
నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే డిజారియంటేషన్
అదే విధంగా, నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే వారికి కొన్ని క్షణాల పాటు “డిజారియంటేషన్” అనబడే పరిస్థితి వస్తుంది. అంటే వారు ఎక్కడ ఉన్నారో, ఎవరు పిలిచారో, ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితి. ఇది మెదడు గందరగోళం చేసే ప్రమాదం ఉంది. కొందరికి ఇది చాలా సేపు కొనసాగుతుంది. అలాంటి స్థితిలో పనులు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.
అయితే నిద్రలో ఉన్న వారిని ఎలా లేపాలి?
వైద్యుల సూచన ప్రకారం, నిద్రలో ఉన్నవారిని నెమ్మదిగా, మృదువుగా లేపాలి. ముందుగా గది వెలుతురు కొంచెం పెంచడం, మెల్లగా పేరు పిలవడం లేదా భుజంపై తేలికగా తాకడం మంచిదని చెబుతున్నారు. ఒక్కసారిగా గట్టిగా అరిచి, బలంగా ఊపి లేపకూడదు. ఇలాంటివి చిన్నగా కనిపించినా మన ప్రియమైన వారి ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన కర్తవ్యం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మెల్లగా, నెమ్మదిగా లేపడం ద్వారా మాత్రమే వారి ఆరోగ్యాన్ని కాపాడగలం.