Buying ganesha idol: భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. పండగ కోసం ముఖ్యంగా గణపతి విగ్రహాన్ని కొనడం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో భావోద్వేగంతో కూడిన పవిత్రమైన కార్యక్రమం. అయితే మార్కెట్‌కు వెళ్లి విగ్రహాన్ని కొనడంతో పాటు.. దానిని ఇంటికి తెచ్చే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తించుకోవాలి. పర్యావరణ హితమైన విగ్రహాల ఎంపిక నుంచి వాటి సరైన సైజ్, నాణ్యత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి వేడుకలను అత్యంత పవిత్రంగా, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవడం మన కర్తవ్యం. విఘ్నేశుడిని మనసారా ఆరాధించడానికి తెచ్చే.. మూర్తి విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. మార్కెట్లో విగ్రహాల కొనుగోలు సమయంలో.. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు.
ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తక్కువ ధరకు.. ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి నీటిలో అవి కరగవు అంతే కాకుండా పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు పూర్తిగా సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే మంచిదని పెద్దవారు చెబుతుంటారు.
ఇంట్లో పూజల కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు.. మీ పూజా గది లేదా సెటప్ స్థలాన్ని బట్టి సరైన సైజ్‌ను ఎంచుకోవాలి. సాధారణంగా.. ఇళ్లలో ప్రతిష్టించడానికి 6 ఇంచుల నుంచి 12 ఇంచుల లోపు ఉండే విగ్రహాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మరీ పెద్ద విగ్రహాలు అయితే.. వాటిని ఇళ్లలో సర్దుబాటు చేయడం ఇబ్బందిగా మారుతుంది. అందుకే విగ్రహం పరిమాణం చిన్నదైనా కూడా పూజ నియమం ప్రకారం చేస్తే చాలు.
Also Read: ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!
గణపతి విగ్రహాన్ని కొనేటప్పుడు భంగిమను పరిశీలించాలి. వినాయకుడి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉన్న విగ్రహం ఇంటికి ఎంతో శుభప్రదమని నమ్ముతారు. ఇది సంతోషం, ప్రశాంతత అంతే కాకుండా సానుకూల శక్తిని ఇస్తుంది. అలాగే కూర్చుని ఉన్న లంబోదరుడి విగ్రహం ఇంట సిరులు కురిపిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా ఆయురారోగ్యాలు అందిస్తాడని భక్తుల విశ్వాసం.
కొన్ని విగ్రహాలకు వేసే రంగులలో.. కెమికల్స్ , సీసం వంటి హానికారక పదార్థాలు ఉంటాయి. ఇవి నిమజ్జనం సమయంలో.. నీటిని కలుషితం చేస్తాయి. కాబట్టి విగ్రహానికి .. వాడిన రంగులు ఆర్గానిక్ లేదా సహజ సిద్ధమైనవా కాదా ?అని చెక్ చేసి చేసి మరీ కొనడం మంచిది.
తొలిపూజ్యుడైన వినాయకుడిని మనసఫూర్తిగా ఆహ్వానించే ఈ పండగను ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా జరుపుకుందాం. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తూ సరైన మట్టి విగ్రహాన్ని ఎంచుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మనమూ భాగస్వామ్యం కావొచ్చు.