మహిళలు తులం బంగారంపై మోజు పడ్డారు.. అందుకే కాంగ్రెస్‌కు ఓటేశారు.
ఉద్యోగాల కోసం విద్యార్థులు తల్లిదండ్రుల కాళ్లు మొక్కి కాంగ్రెస్‌కు ఓట్లేపించారు.. ఇప్పుడు బుద్దొచ్చిందా?
రైతుల్లారా మీకు ఇప్పుడు సోయి వచ్చిందా?
సోనియా వీపు పగులుతదనే భయపడి తెలంగాణ ఇచ్చింది..!
రామన్న ఎక్కడ మాట్లాడినా ఆ మొత్తం ప్రసంగంలో ఓసారి జనాలను తిట్టిపోసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాడు. అది అన్యపదేశంగా వస్తుందా? టంగ్ స్లిప్పవుతుందా? ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ తప్పుతుందా…? తెలియదు. కానీ తనకు తెలియకుండా తిట్టేస్తున్నాడు కేటీఆర్.
సహజమైన తన అలవాటు దోరణి అదే అన్నట్టుగా కూడా జనాలు అనుకునేలా మాట్లాడుతున్నాడు. ఇంకా ఓటమిని జీర్ణించుకోవడం లేదేమో..? కోపం కట్టలు తెంచుకుంటుందేమో తెలియదు. కానీ తిట్టేస్తున్నాడు. సోయి లేదా అని వెటకారమాడుతున్నాడు. ఏవీ ఉద్యోగాలు ఎక్కడా.. ? మీకు ఇప్పుడు తెలిసొచ్చిందా? బుద్దొచ్చిందా? అని నిలదీస్తున్నాడు.
తులం బంగారమిస్తానగానే మోజు పడ్డారు.. ఆశ పడ్డారు.. అంటూ జనాలకు మరీ వ్యక్తిత్వం లేనట్టుగా .. ఓటర్లు అత్యాశపరులు.. ఆశలు పెడితే చాలు.. ఓట్లేసేస్తారు.. అని కించపరిచేలా కూడా ఆయన మాటల దాడులు కొనసాగుతున్నాయి. హామీలు ఇచ్చారు…. అమలు చేయండి.. అని అడగడం వరకే నీ హక్కు, బాధ్యత. జనం ఏమనుకుని వేశారు..? వాళ్ల మదిలో ఏముంది? ఎందుకు కాంగ్రెస్‌కు ఓటేశారు..? అనేవి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు. మీ ఓటమికి లోపాలు, శాపాలు ఏవే తెలుసుకుని, మసులుకోవాల్సంది మీరు.
కానీ మధ్యలో జనాన్ని ఎందుకు దోషులను చేయడం అని తిట్టిపోస్తున్నారంతా. అయినా తీరు మార్చుకోవడం లేదు కేటీఆర్. అధికార పార్టీని ఏమన్నా తిట్టుకో.. కానీ జనాన్ని కూడా అందులో జమకట్టి మరి దుమ్మెత్తిపోస్తూనే ఉండటమే బాగా లేదంటున్నారు.
కేసీఆర్ అప్పుడే చెప్పాడు… విన్నారా? అనుభవించండి.. అని ఆనందం పొందినట్టుగానే ఉంటున్నాయా మాటలు. అంటే.. కాంగ్రెస్ హామీలిచ్చింది… జనం ఆశపడి.. అర్రులు చాచి ఎగబడి ఎగబడి ఓట్లేశారు.. అందుకే మీరు ఓడిపోయారు.. కానీ మీ లోపమేమీ లేదు. మీ వైఫల్యాలేమీ లేవు.. అని కదా మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు కేటీఆర్..? అని కూడా నిలదీస్తున్నారు జనం.
సోయి వచ్చిందా? మోజు పడ్డారు కదా? బుద్దొచ్చిందా? ఆశ పడ్డారా?…. నిజానికి ఇవన్నీ మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు. నిలదీసుకోవాల్సిన అంశాలు. తరిచి చూసుకోవాల్సిన లోపాలు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పాపాలు…అని జనాలు తిరగబడేలా చేసుకోవద్దంటున్నారు జనం.