వందే భారత్ రైలు చక్రాలకు గొలుసులు చుట్టి తాళాలు వేసిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసి.. అంత పెద్ద రైలును ఎవడు ఎత్తుకుపోతాడంటూ నెటిజన్స్ జోకులు వేస్తున్నారు. అంద పెద్ద రైలుకు అంత చిన్న తాళమా అని సెటైర్లు కూడా వేస్తున్నారు. అసలు విషయం తెలిశాక అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇలా రైళ్ల చక్రాలకు తాళాలు వేయడమనేది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇలా తాళాలు వేయడానికి పెద్ద కారణమే ఉంది.
దొంగలకు భయపడో, రైలు చోరీ కాకూడదనో ఈ తాళలు వేయరు. ఆ రైలు సేఫ్టీ కోసమే తాళాలు వేస్తారు. ఇది భారతీయ రైల్వే ప్రామాణిక భద్రతా నియమం. రైలును చాలా సేపు ప్లాట్‌ఫామ్ ట్రాక్ మీద పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇలా చక్రాలకు తాళాలు వేస్తారు. లేకపోతే.. చక్రాలు దానంతట అవే తిరిగి ముందుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైల్వే ట్రాక్ వాలుగా ఉన్నా.. ఈదురు గాలులు వీస్తున్నా, ట్రాక్ కాస్త వంగి ఉన్నా.. బ్రేకులు విఫలమై ముందు లేదా వెనక్కి దొర్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. పట్టాలు, చక్రాలను కలిపి లాక్ చేస్తారు. కొన్ని చోట్ల చక్రాల కింద చెక్క దిమ్మలు, హ్యాండ్ బ్రేకులు వేసి ఉంచడం వంటివి చేస్తారు. చక్రాలను లాక్ చేసే పద్ధతి బ్రిటీష్ కాలం నాటి నుంచి ఉంది. విదేశాల్లో కూడా ఈ పద్ధతి పాటిస్తారు.
ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ వంటి అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే ఇంకా చక్రాలకు తాళాలు వేయడం ఏమిటీ అనే సందేహం మీకు రావచ్చు. అయితే.. ఎంత ఆధునిక రైళ్లు వచ్చినా.. మెకానికల్ లాకింగ్ అనేది అత్యంత సురక్షితమైన మార్గమని రైల్వే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఆటోమెటిక్ ప్రెజర్ బ్రేకులు ఎక్కువ సేపు పనిచేయవు. రైలును ఎక్కువ సేపు పార్క్ చేసినప్పుడు ప్రెజర్ తగ్గిపోయి.. బ్రేకులు వదిలేసే అవకాశం ఉంది. అందుకే ఫిజికల్ లాకింగ్ అవసరం.
లోకో పైలెట్ ప్రమేయం లేకుండా పరుగులు పెట్టే రైళ్లను ‘రన్అవే ట్రైన్స్’ అంటారు. 2024లో జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో ఆపి ఉన్న 53 బోగీల గూడ్స్ రైలు.. డ్రైవర్ లేకుండానే ముందుకు కదిలింది. గంటకు 80 కిమీల వేగంతో దాదాపు 70 కిమీల దూరంలో పంజాబ్‌లోని బాసి వరకు ప్రయాణించింది. ట్రాక్ మీద చెక్క దిమ్మలు ఉంచి.. ఆ రైలును ఆపారు.
Also Read: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
2018లో 22 బోగీలతో ఉన్న ఒడిశా – అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఇలాగే వెళ్లిపోయింది. ఒడిశాలోని టిట్లాగడ్ స్టేషన్‌లో రైలు ఇంజిన్ మారుస్తున్న సమయంలో బ్రేకులు వదిలేశాయి. దీంతో రైలు దానంతట అదే 12 కిమీలు ప్రయాణించింది. దాన్ని కూడా రాళ్లు, చెక్కలు అడ్డు పెట్టి ఆపారు. అప్పటి నుంచి రూల్స్‌ను కఠినతరం చేశారు. ఏదైనా రైలును లోకో పైలెట్ లేకుండా ఎక్కువ సేపు పట్టాలపై నిలిపి ఉంచాలంటే.. చక్రాలకు చెక్క దిమ్మలను అడ్డుగా పెట్టడమే కాకుండా.. గొలుసులతో లాక్ చేయడం కూడా తప్పనిసరి అనే రూల్ పెట్టారు.