ఔను, మీరు చదివింది కరక్టే. పక్షి ఉమ్ము.. అంటే దాని నోటిలో నుంచి వచ్చే లాలాజలం. దీనికి మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. ఎందుకంటే.. ఈ ఉమ్మును చాలామంది తింటారట? అదేం పోయేకాలం అనుకోవద్దు. వాళ్లు ఆ పక్షి ఉమ్ము తినేందుకు బలమైన కారణమే ఉందట. అయితే ఆ ఉమ్మును సేకరించడం అంత ఈజీ కాదు. అందుకే దాని ఖరీదు చాలా ఎక్కువ. దాని రంగు, నాణ్యతను బట్టి కిలో పక్షి లాలాజలం రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతుంది.
ఈ పక్షి లాలాజలంతో చేసే ఈ ఆహారాన్ని ‘ఈస్ట్ ఆఫ్ కావియార్’ (Caviar of East) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఆహారాల్లో ఒకటి. వాస్తవానికి ఇది పక్షి గూడు నుంచి తయారు చేసే సూప్. దీన్ని పక్షి గూడు నుంచి తయారు చేస్తే.. లాలాజలం అంటున్నారేంటీ అనే సందేహం మీకు రావచ్చు. ఆ గూడు తయారయ్యేది పక్షి ఉమ్ముతోనే. స్విఫ్ట్‌లెట్స్ అనే చిన్న పక్షులు కొండ అంచుల్లో గూళ్లు పెడతాయి. అవి తమ ఉమ్మును ఉపయోగించి కప్పు షేపులో గూళ్లను తయారు చేస్తాయి. ఆ ఉమ్ము గాలి తగలగానే గట్టి పడి గూడులా మారుతుంది. దాన్నే సేకరించి వివిధ విధానాల్లో శుభ్రం చేసి సూప్‌లా తయారు చేస్తారు.
పక్షి నోటి నుంచి వచ్చే స్వచ్ఛమైన లాలాజలం అది. ఇందులో చాలా ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయట. కాబట్టి.. చైనాతోపాటు పలు ఆసియా దేశాల్లో ఈ సూప్‌ను చాలామంది ఇష్టంగా తింటారు. చైనాలో దీన్ని ‘యాన్ వో’ అని పిలుస్తారు. దీన్ని తింటే అందంతోపాటు ఆరోగ్యం కూడా వస్తుందనేది వారి నమ్మకం. అంతేకాదండోయ్.. ఈ సూప్ తిన్నవారి ఆయుష్సు కూడా పెరిగిపోతుందట.
లాలాజలంతో తయారైన ఈ గూళ్లను సేకరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఈ గూళ్లు రాతి పర్వతాల శిఖరాలపై ఉంటాయి. దీంతో తాళ్ల సాయంతో కొండపైకి ఎక్కి వీటిని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా సాహసంతో కూడుకున్న పని. అంత ఎత్తు నుంచి పడితే ప్రాణాలు పోతాయ్. దాన్ని సేకరించగానే పని అయిపోతుందని అనుకుంటే పొరపాటే. దాన్ని శుభ్రం చేసే ప్రక్రియ కూడా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే.. ఆ గూళ్లలో పక్షులు నివాసం ఉంటాయి. దానివల్ల అందులో ఆ పక్షుల రెట్టలు, వాటి ఈకలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే, పర్వతాలపై ఉన్న గూళ్లు అన్నీ ఒకేసారి సేకరించారు. అలా చేస్తే ఆ పక్షుల మనుగడకే నష్టం ఏర్పడుతుంది. అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ గూళ్లు కేవలం గుడ్లు పెట్టే సమయంలోనే తయారు చేస్తాయి. గుడ్లు పెట్టి పిల్లలు ఏర్పడిన తర్వాతే.. ఆ గూళ్లను సేకరిస్తారు. చైనాలోని సంపన్నులు దీన్ని లగ్జరీ ఫుడ్‌గా భావిస్తారు. దీని కోసం ఎంత డబ్బైన పెడతారు.
సాధారణ పక్షి గూడు ఖరీదు కిలో రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. వీటిలో ఎర్ర రంగు గూళ్లయితే ఇంకా ఖరీదు ఉంటాయి. సాధారణ తెల్ల గూళ్లయితే కిలో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ధర పలుకుతుంది. సేకరించేప్పుడు ఆ గూళ్లు గట్టిగా ఉంటాయి. వాటిని మళ్లీ ద్రవంలా మార్చి సూప్ తయారు చేస్తారు. రెస్టారెంట్ ఒక గిన్నెడు(మీడియం సైజ్) సూప్ ఖరీదు రూ.2,500 నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. ఇది ఆ పక్షి లాలాజలం రంగు, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు ధనవంతుల స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో డిమాండు భారీగా పెరిగింది. పైగా ఈ సూప్ తాగితే అందంగా అమాంతంగా పెరిగిపోతుందని, చర్మ సమస్యలు రావని, చర్మం కాంతివంతంగా మెరిసిపోతుందనే ప్రచారం ఉండటంతో జనాలు ఎగబడి మరీ ఈ సూప్‌ను తాగేస్తున్నారు.
Also Read: చైనా రాశిఫలాలు.. మీరు ఆ ఏడాదిలో పుట్టి ఉంటే డబ్బే డబ్బు, 2026లో మీకు తిరుగే ఉండదు!