Delhi Crime: సోషల్‌మీడియా వల్ల మంచే కాదు.. చెడు కూడా అంతే వుంది. పనిపాటా లేని కొందరు వ్యక్తులు, నిత్యం సోషల్‌మీడియాలో హంగామా చేస్తుంటారు. వారికి కనెక్ట్ అయితే మన పనైపోయినట్టే? సరిగ్గా అలాంటి ఘటన ఓ వైద్యురాలికి జరిగింది. ఆర్మీ అధికారినంటూ నమ్మించి ఆపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.
ఢిల్లీలో మరో దారుణం
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పని చేస్తోంది 27 ఏళ్ల ఓ వైద్యురాలు. ఆర్మీ అధికారినంటూ ఓ వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్నాడు. నిజమేనని ఆమె నమ్మేసింది. కొన్నిరోజుల తర్వాత ఇద్దరు తమ ఫోన్ నంబర్లు మార్చుకుని వాట్సాప్‌లో చాట్ చేయడం మొదలుపెట్టారు. తాను జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ అధికారిగా పని చేస్తున్నానని సదరు వైద్యురాలిని నమ్మించాడు. అందుకు సంబంధించి ఫోటోలను ఆమెకి పంపాడు.
నిజమేనని ఆమె కూడా నమ్మేసింది. ఈనెల రెండోవారంలో ఆ వైద్యురాలి ఇంటికి వెళ్లాడు సదరు వ్యక్తి. మత్తు మందు కలిపిన ఆహారాన్ని వైద్యురాలికి ఇచ్చాడు. భోజనం తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం తర్వాత అక్కడి నుంచి సైలెంట్‌గా పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్టు తెలిసి ఆమె షాకైంది.
ఆర్మీ అధికారినంటూ వైద్యురాలిపై అత్యాచారం
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్టు చేశారు. వైద్యురాలిని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేశానని నిజం అంగీకరించాడు. ఆర్మీ యూనిఫాం కొనుగోలు చేసి, వాటిని ధరించి ఆయా ఫొటోలు పంపేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంతకీ నిందితుడు ఎవరో తెలుసా?
ALSO READ: టూత్ పేస్ట్ అనుకుని.. ఎలుకల మందు తిన్న మూడేళ్ల చిన్నారి
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. నిందితుడు ఆరవ్ మాలిక్. ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతానికి చెందినవాడు. విచారణ సందర్భంగా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఓ షాపు నుండి యూనిఫామ్‌ను కొనుగోలు చేసినట్లు మాలిక్ వెల్లడించాడు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. యువతీయువకులు సోషల్‌మీడియాతో జాగ్రత్త.. మేలుకోకుంటే మునిగిపోతారు.