Biggest Flops In 2025 : సినిమా రంగంలో ఇప్పుడు వందల కోట్లు ఖర్చు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, 2025లో విడుదలైన కొన్ని భారీ చిత్రాలు నిర్మాతలకు చుక్కలు చూపించాయి. గ్లోబల్ స్టార్ నుంచి బాలీవుడ్ సుల్తాన్ వరకు అందరికీ ఈ ఏడాది బాక్సాఫీస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సంవత్సరం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక గుణపాఠం లాంటిది. భారీ బడ్జెట్, అగ్ర తారలు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ.. కేవలం కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఎంతటి పెద్ద సినిమానైనా నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారని ఈ ఏడాది బాక్సాఫీస్ ఫలితాలు నిరూపించాయి. ఈ ఏడాది వచ్చిన అతి పెద్ద డిజాస్టార్ సినిమాల లిస్ట్ చూద్దాం.
1. గేమ్ ఛేంజర్
ఈ ఏడాది అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ నిలిచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో దాదాపు రూ.250 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. రూ.450 కోట్లు ఖర్చు పెట్టగా రూ.195 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
2. వార్ 2
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండేవి. హృతిక్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు బిగ్ స్టార్స్ ఉన్నా, సినిమా బడ్జెట్‌ను రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమా కోసం రూ.400 కోట్లు ఖర్చు చేయగా, బడ్జెట్‌ను రికవరీ చేయడంలో ఈ చిత్రం విఫలమై బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. ఈ సినిమా రూ.244 వసూలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. తద్వారా యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది.
3. తగ్ లైఫ్
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘తగ్ లైఫ్’ 2025లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 97 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఫలితంగా నిర్మాతలకు సుమారు రూ. 203 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. విజువల్స్ బాగున్నా, కథనం ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.
4. హరి హర వీర మల్లు
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ ఉన్నప్పటికీ, నిర్మాణంలో జరిగిన విపరీతమైన ఆలస్యం, పెరిగిన బడ్జెట్ ఈ సినిమా కొంపముంచాయి. రూ.300 కోట్ల బడ్జెట్‌కు కేవలం రూ.97 కోట్లు మాత్రమే రాబట్టింది. నిర్మాణంలో జరిగిన విపరీతమైన ఆలస్యం, మారిన దర్శకులు మరియు పెరిగిన వడ్డీల భారం ఈ సినిమాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ సినిమా నిర్మాతకు రూ.184 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
5. సికందర్
సల్మాన్ ఖాన్ , మురుగదాస్ కాంబినేషన్ అనగానే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, కథలో కొత్తదనం లేకపోవడంతో సల్మాన్ ‘ఈద్’ సెంటిమెంట్ కూడా ఈసారి ఫలించలేదు. రష్మిక మందన్న గ్లామర్ సైతం ఈ సినిమాను కాపాడలేకపోయింది. సికందర్ సినిమా కోసం సుమారు రూ.200 కోట్లు ఖర్చు పెట్టగా, 130 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు రూ.70 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది.
ఇలా స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. 2025 ఫలితాలను చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది.. కథే హీరో. స్టార్ పవర్‌తో థియేటర్లకు జనాన్ని రప్పించవచ్చు కానీ, సినిమాను గట్టెక్కించాలంటే మాత్రం బలమైన కథనం ఉండాల్సిందే.