Banned Cigarettes: నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరితోపాటు వారి వద్ద పని చేస్తున్న వ్యక్తిని ఈగల్ ఫోర్స్ అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 152 ఈ సిగరెట్లు, 34ప్యాకెట్ల విదేశీ సిగరెట్లు, 3స్కానర్లుతోపాటు తొమ్మిదిన్నర వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబూబకర్, రమీజ్లు మాదాపూర్ మెట్రో పిల్లర్ ప్రాంతంలో రెండేళ్లుగా స్మార్ట్ స్మోక్ పేర షాపు నడిపిస్తున్నారు. దీంట్లో మహ్మద్ రిహాన్ ఖాన్, మహ్మద్ జుబేర్లను ఉద్యోగులుగా పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం దుర్గం చెరువు రోడ్డులోని పిల్లర్ నెంబర్ 1745వద్ద స్మోక్ ఆన్ వైబ్ పేర మరో షాపును ప్రారంభించారు.
దీంట్లో ఆషిఖ్ అనే యువకున్ని పనికి పెట్టుకున్నారు. స్వస్థలంలో ఉంటూఉద్యోగులను ద్వారా దందా చేస్తున్నారు. వెబ్ సైట్ ఏర్పాటు చేసుకుని.. ఈ సిగరెట్ల విక్రయాల కోసం నిందితులు ఏకంగా https://vapestorehyd.in/ పేర ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీని ద్వారా ఎవరైనా ఆర్డర్ పెట్టగానే 7337274523, 9063357245 నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేసి ఆర్డర్ చేసిన వ్యక్తికి క్యూఆర్ కోడ్ పంపించేవారు. డబ్బు తమ ఖాతాలోకి క్రెడిట్ కాగానే లొకేషన్ షేర్ చేసి అక్కడికి వెళ్లి సరుకు తీసుకోవాలని సూచించేవారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు డెలివరీ కోసం ర్యాపిడో డెలివరీ సర్వీసులను ఉపయోగిస్తూ వస్తున్నారు.
Also read: iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!
ఈ దందా ద్వారా గడిచిన రెండేళ్లలో అబూబకర్ సిద్దిఖీ పేరన ఉన్న హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంకుల్లోని ఖాతాల్లోకి 2.22కోట్ల రూపాయలు క్రెడిట్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. వీరి నుంచి హైదరాబాద్ కు చెందిన 130మంది రెగ్యులర్ గా సిగరెట్లను కొంటున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితులు అబూబకర్, రమీజ్లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.
Also read: ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్