Chiranjeevi NagAshwin: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఒక భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కల్కి 2898 AD’ చిత్రంతో భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్‌కు జోడించి ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్, ఇప్పుడు చిరంజీవి కోసం ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం కలిగిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథా చర్చలు ఇప్పటికే ప్రాథమిక దశకు చేరుకున్నాయని, త్వరలోనే నాగ్ అశ్విన్ మెగాస్టార్‌కు పూర్తిస్థాయి వెర్షన్‌ను వినిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఒక శక్తివంతమైన పాత్రలో చూసే అవకాశం కలుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also-‘హే బల్వంత్’ మూవీ రివ్యూ: -సుహాస్ మార్క్ నవ్వులు.. లాస్ట్ లో ఎమోషన్ల దెబ్బ !
ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించడానికి సిద్ధమవుతోంది. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ మరియు చిరంజీవి మధ్య దశాబ్దాల కాలంగా ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. అదే తరహాలో ఇప్పుడు నాగ్ అశ్విన్ విజన్‌కు, వైజయంతీ మూవీస్ మేకింగ్ స్టైల్‌కు మెగాస్టార్ ఇమేజ్ తోడైతే, అది కేవలం తెలుగు సినిమాగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఒక విజువల్ వండర్‌గా నిలిచిపోవడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారీ సెట్టింగ్‌లను ఉపయోగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి తన సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. నాగ్ అశ్విన్ తన తదుపరి భారీ అడుగు ఎటువైపు వేస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే తెలుగు సినీ చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్ మొదలైనట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగ్ అశ్విన్ రాసుకున్న కథలో మెగాస్టార్ మ్యానరిజమ్స్ మరియు పౌరాణిక పాత్రల గాంభీర్యం సరిగ్గా సరిపోతాయని, ఇది చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే, అది టాలీవుడ్‌లో అతిపెద్ద అనౌన్స్‌మెంట్ కానుంది.