Shiva Re- Release: ఇండస్ట్రీలో ఎన్ని తరాలు మారినా.. ఎన్ని సినిమాలు వచ్చినా చరిత్ర సృష్టించిన కొన్ని సినిమాలు ఎప్పటికీ మరుగున పడవు. అలాంటి సినిమాలు ఇప్పుడు మళ్లీ సరికొత్తగా వెండితెరను ఏలడానికి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ లు ఎంత ట్రెండ్ సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త సినిమాలు కన్నా రీరిలీజ్ లే అదరగొడుతున్నాయి. అందుకే అకేషన్ ఉన్నా లేకపోయినా మేకర్స్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
ఇక అక్కినేని నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏంటి అంటే.. ఎవ్వరైనా తడుముకోకుండా చెప్పేది శివ పేరే. 1989 లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక గుర్తింపు పొందిన కల్ట్ క్లాసిక్ అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల, రఘువరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ దశనే మార్చేసింది.
ఇక దాదాపు 36 ఏళ్ళ తరువాత శివ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఏయన్నార్ 101వ జయంతి సందర్భంగా ఈ సినిమాను నవంబర్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ రీరిలీజ్ కు సంబంధించిన అన్ని పనులను మేకర్స్ పూర్తిచేశారు. శివ ను4K డాల్బీ ఆట్మాస్‌లో థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు.ఇంతకుముందు సెప్టెంబర్ 12న రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఇప్పుడు నవంబర్ 14కి డేట్ లాక్ అయింది. ఇక రిలీజ్ డేట్ వచ్చేసరికి అక్కినేని ఫ్యాన్స్ ఆనందంతో గెంతులు వేస్తున్నారు. థియేటర్ లో రచ్చ చేయడానికి సైకిల్ చైన్స్ రెడీ చేసుకోండమ్మా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి శివ రీ రిలీజ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.
ప్రస్తుతం నాగార్జున కెరీర్ గురించి చెప్పాలంటే.. ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో వచ్చి మంచి విజయాలను అందుకున్న నాగ్.. ఇప్పుడు తన 100 వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రా. కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.