Parasakthi: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెండితెరకు పరిచయమై.. హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. వరుసగా మంచి మంచి కథన ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. గతేడాది అమరన్ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి శివ కార్తికేయన్ భారీ విజయాన్ని అందుకున్నాడు.
అమరన్ తర్వాత ఈ హీరో రేంజ్ మారిపోయింది. ఇక ఈ ఏడాది మదరాసి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఈ సినిమా మాత్రం అతనికి పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఆశలన్నీ పరాశక్తి మీదే పెట్టుకున్నాడు. ఆకాశం నీ హద్దురాలాంటి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తుండగా రవి మోహన్, అధర్వ, శ్రీ లీల తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ వీడియోను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తాజాగా మొదటి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోక అంటూ సాగిన ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
పీరియాడిక్ సినిమా కావడంతో శ్రీలీల అప్పటి చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంట చూడముచ్చటగా ఉన్నారు. జీవి ప్రకాష్ సంగీతం చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. భాస్కరభట్ల లిరిక్స్ అందించగా రేవంత్, డీ ఈ సాంగ్ ను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సింగారాల సీతాకోక ఫుల్ సాంగ్ నవంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పైనే శ్రీలీల కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు హీరోల పక్కన సాంగ్స్ కి మాత్రమే పరిమితమైన అమ్మడు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తుందని సమాచారం. మరి ఈ సినిమాతో శ్రీ లీల హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.