Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా మాత్రమే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా తనకు నచ్చితే చేసేస్తూ ఉంటాడు. విలన్ గా, సపోర్టివ్ రోల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఒక పక్క హీరోగా చేస్తూనే ఇంకోపక్క విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా మారాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఇక ఇవే కాకుండా విజయ్ సేతుపతి మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అది హీరోగా కాదు.. విలన్ గా. అందులోనూ ఎవరికీ విలన్ అంటే.. తలా అజిత్ కి అని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వచ్చింది.ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. తమిళ్ తంబీస్ కు మాత్రం ఫ్యాన్ మూమెంట్స్ ఉండడంతో కొద్దొగొప్పో అక్కడ ఆడింది.
మొదటి సినిమా అంతంత మాత్రంగా ఉన్నా కూడా అజిత్.. అధిక్ కే రెండో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి మాత్రం ఈ కుర్ర డైరెక్టర్.. అజిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే స్టార్స్ ను రంగంలోకి దించుతున్నాడని సమాచారం. ఈ సినిమాలో అజిత్ కు ధీటైన విలన్ కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాస్టర్ సినిమాలో విజయ్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించిన సేతుపతి ఇప్పుడు అజిత్ కోసం విలన్ గా మారుతున్నాడట. త్వరలోనే విజయ్ సేతుపతిని సినిమాలోకి అధికారికంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
కేవలం సేతుపతిని మాత్రమే కాకుండా మరో హీరో రాఘవ లారెన్స్ ను కూడా ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారని టాక్. ప్రస్తుతం రాఘవ.. కాంచన 4 తో బిజీగా ఉన్నాడు.తన సొంత సినిమాలు తప్ప వేరే హీరోల సినిమాల్లో చేయడం రాఘవకు అలవాటు లేదు. చాలా రేర్ గా వేరే హీరోల సినిమాల్లో నటిస్తాడు. అతడిని కూడా అధిక్ ఒప్పించాడు అంటే కథలో దమ్ముందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.