గ్రామీణ వంటకాలలో చేపల పులుసుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తాజా చేపలు, కొబ్బరి పేస్ట్, చింతపండు రసం, సుగంధ ద్రవ్యాల సమ్మేళనంతో తయారయ్యే ఈ వంటకం, భోజనానికి అద్భుతమైన రుచి తీసుకువస్తుంది. ఈ పులుసు సాదాసీదా పదార్థాలతోనే తయారవుతుందిగానీ, దానిలో దాగి ఉన్న గ్రామీణ టచ్ రుచిని మరింత పెంచుతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే ఒక్కముక్క కూడా మిగలదు.
చేపల పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేపలు – ఒక కిలో
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
చిన్న ఉల్లిపాయలు – 5 సన్నగా తరిగినవి
టొమాటో – 1 చిన్న ముక్కలుగా కట్ చేసినవి
కరివేపాకు – గుప్పెడు
చింతపండు – చిన్న నిమ్మకాయ పరిమాణం
ఉప్పు – రుచికి సరిపడా
కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
ఎండు మిరపకాయలు – ఎనిమిది
ధనియాలు – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూన్)
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
చేపల పులుసు తయారీ విధానం
1. చింతపండును ముందుగానే నీటిలో అరగంట పాటూ నీటిలో నానబెట్టి, రసం తీసుకొని పక్కన ఉంచాలి.
2. చేపల పులుసు కోసం మసాలా రుబ్బుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేయాలి.
3. అందులో కొబ్బరి, ఉల్లిపాయల తరుగు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించి చల్లారనివ్వాలి.
4. వీటిలో మిక్సీలో వేసి నీటితో కలిపి మెత్తగా రుబ్బి పేస్టులా చేసుకోవాలి.
5. ఇప్పుడు చేపల పులుసు వండేందుకు మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి.
6. అందులో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయల తరుగు పావుకప్పు, టొమాటో తరుగు పెట్టి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
7. ఆ మిశ్రమంలో ఉప్పు వేసి బాగా ఉడికించాలి. పచ్చి వాసన పోయేదాకా మరిగించుకోవాలి.
8. నూనె పైకి తేలే వరకు ఉడికించాక శుభ్రంగా కడిగిన చేప ముక్కలు అందులో వేసి కలుపుకోవాలి. చివరగా కరివేపాకులు, కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
9. పావుగంట సేపు ఉడికిస్తే చేపల పులుసు సిద్ధమైతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని అదిరిపోతుంది.
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. చేపల పులుసు వంటి వంటకం రుచికరమైనదిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక రకాల లాభాలు కూడా ఇస్తుంది. ఈ చేపల్లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D అధికంగా ఉంటాయి. వీటివల్ల మెదడు కణాల పనితీరు మెరుగవుతుంది. పిల్లలు, విద్యార్థులు,వృద్ధులు చేపల పులుసు తింటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత,మానసిక చురుకుదనం పెరుగుతుంది. చేపలలో ఉన్న ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే కండరాల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్రీడాకారులు లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు చేపల పులుసు తింటే శక్తి, బలం పెరుగుతుంది.