Deepika Padukone Kalki 2: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తుంది. అమ్మడి గొంతెమ్మ కోరికలు తీర్చలేక వైజయంతీ మూవీస్ కల్కి 2 నుంచి తప్పించారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు దీని గురుంచే మాట్లాడుకుంటుంది. అసలు కారణాలు ఏంటి.. ? అనుకుంటున్న కారణాలు ఏంటి..? అనేది పక్కన పెడితే.. దీపికా పాత్ర లేకపోతే కల్కి సీక్వెల్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
కల్కి పార్ట్ 1 లో సుమతి పాత్రలో దీపికా నటించింది. ఆమె గర్భంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడును కాపాడుకోవడానికి అశ్వద్ధామ ప్రయత్నిస్తుండగా.. సుమతి.. సుప్రీం యాస్కిన్ కు అప్పచెప్పడానికి భైరవ ఒకపక్క ప్రయత్నిస్తుంటారు. అలా ల్యాబ్ సబ్జెక్ట్ అయిన SUM-80కి చెందిన పుట్టబోయే బిడ్డ కల్కిని రక్షించే లక్ష్యం నేపథ్యంలో మొదటి పార్ట్ ను తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.
ఇక రెండో భాగంలోనే అసలు సినిమా ఉంటుంది. దీపికా కల్కికి జన్మనివ్వడం, సుప్రీం యాస్కిన్, కల్కికి మధ్య యుద్ధం.. ఇలా అసలు కథ అంతా కల్కి 2 లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీపికాను తొలగిస్తే.. ప్రేక్షకులు ఆమె ప్లేస్ లో మరో కొత్త హీరోయిన్ ను ఒన్ చేసుకుంటారా.. ? అలా చేసుకోవాల్సి వస్తే దీపికా ప్లేస్ లో ఎవరు వస్తే బావుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే పోల్ నడుస్తుంది.
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా దీపికాగా ఏ హీరోయిన్ నటిస్తే బావుంటుందో అని అభిమానులు తమకు నచ్చిన పేర్లు చెప్పుకొస్తున్నారు. అనుష్క నుంచి నిన్న మొన్న వచ్చిన శ్రీలీల వరకు పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రెగ్నెంట్ లేడీని మార్చడం కుదురుతుందా.. ? దాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారా.. ? నాగీ ఏది ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకోడు అంటే.. ఒకవేళ దీపికా పాత్రనే లేపేశాడా.. ? ప్రస్తుతం ఇదే అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న.
దీపికా పాత్ర లేపడం అంటే పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. కథ మొత్తం రాసినవాడికి ఒక పాత్రను లేపేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ, ఆ పాత్రను ఎత్తేయడాన్నీ ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా చూపించాలి. SUM-80 చనిపోతుందా.. ? లేక లోపల బేబీ చనిపోతుందా.. ? ఆమెను ఎవరైనా ఎత్తుకెళ్తారా.. ? యాస్కిన్ దాస్తాడా.. ? అసలు ఆ పాత్రనే లేకపోతే కల్కి ఎలా జన్మిస్తాడు.. అశ్వద్ధామ శాపం ఎలా పోతుంది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానం చెప్పగల ఒకే ఒక్కడు నాగ్ అశ్విన్. మరి ఆయన యేటి ఆలోచించాడో ఆయనకే ఎరుక. అది మనకు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.