Yash Hemanth:కేజీఎఫ్’ అనే ఒక్క ఫ్రాంచైజ్ కన్నడ పరిశ్రమ రేంజ్‌ను మాత్రమే కాదు, నటుడు యష్ ఇమేజ్‌ను కూడా దేశవ్యాప్తంగా మార్చేసింది. రాకీ భాయ్‌గా బాక్సాఫీస్ వద్ద ఐదు సంవత్సరాల క్రితం సృష్టించిన సునామీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే ఆ రేంజ్ క్రేజ్ వచ్చిన తర్వాత కథల ఎంపికలో యష్ చాలా డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు. అందులో భాగంగానే గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ (Toxic) మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా విషయంలో ఆయన పడిన కష్టం, కేటాయించిన సమయం తక్కువేమీ కాదు. కానీ, అనుకున్న స్థాయిలో అవుట్‌పుట్ రాకపోవడం, ఆశించిన మేర టాక్ తెచ్చుకోకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.
ఈ క్రమంలోనే యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎలా ప్లాన్ చేయబోతున్నారనే అంశంపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉన్నప్పటికీ, మళ్లీ ఐదేళ్ల పాటు ఒక్క సినిమాకే కేటాయించడం సరైన నిర్ణయం కాదని ఆయన భావిస్తున్నారట. వీలైనంత త్వరగా అంటే, ఏడాది వ్యవధిలోనే ఓ పక్కా కమర్షియల్ వినోదాత్మక చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో యష్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ గ్యాప్ పూర్తి చేయడానికి ముందుగా టాలీవుడ్ నుంచి కొందరు స్టార్ డైరెక్టర్లను సంప్రదించే ప్రయత్నం చేసినా, ప్రస్తుతం మన టాప్ డైరెక్టర్లందరూ తమ తదుపరి ప్రాజెక్టులతో విపరీతమైన బిజీగా ఉన్నారు. దీంతో తన హోమ్ గ్రౌండ్ అయిన శాండల్‌వుడ్ వైపే యష్ దృష్టి పెట్టారు . అక్కడ తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సెన్సిబుల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ హేమంత్ ఎం. రావుతో ప్రస్తుతం యష్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ‘కవలుదారి’ లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో పాటు రెండు భాగాలుగా వచ్చిన ప్రేమకావ్యం ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaradaati Ello) సిరీస్‌తో హేమంత్ రావు డైరెక్టర్‌గా ఏ స్థాయికి చేరుకున్నారో అందరూ చూశారు. భావోద్వేగాలను స్క్రీన్ పై ఆవిష్కరించడంలో ఆయన మార్క్ ప్రత్యేకం. హేమంత్ చెప్పిన ఒక లైన్ యష్‌కు బాగా నచ్చడంతో, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అటు బాలీవుడ్‌లో నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రంలో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కూడా కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీటి మధ్యలోనే హేమంత్ రావు కాంబో మూవీ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఈ కొత్త కాంబినేషన్‌కు సంబంధించి యష్ టీమ్ కానీ, దర్శకుడు హేమంత్ రావు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.