Ex Lovers Reunion: ప్రేమలో ఉన్నప్పుడు కలిసిన వ్యక్తిని పెళ్లి తర్వాత మర్చిపోవడం సహజమే. అయితే, ఓ దేశంలో ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. పెళ్లయిన దంపతులు తమ మాజీ ప్రేమికులను కలుసుకునేందుకు ప్రతి సంవత్సరం జరిగే ఓ ప్రత్యేక మార్కెట్ కు వెళ్తారు. అంతేకాదు.. భార్య తన భర్తను మాజీ ప్రియురాలిని కలవడానికి, భర్త తన భార్యను మాజీ ప్రియుడిని కలవడానికి అనుమతిస్తారట. వినడానికి వింతగా అనిపించినా, అక్కడి ప్రజలకు ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సంప్రదాయం. ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడ ఉందంటే..
ఈ వింత ప్రేమ మార్కెట్ వియత్నాంలో ఉంది. హా జియాంగ్ ప్రాంతంలోని ‘ఖౌ వాయ్ లవ్ మార్కెట్’ ప్రతి ఏటా జరుగుతుంది. సాధారణ మార్కెట్లలో కూరగాయలు, దుస్తులు, ఇతర వస్తువులు అమ్ముతుంటారు. కానీ, ఈ మార్కెట్ మాత్రం పాత ప్రేమికుల కలయికకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే ఈ ప్రత్యేక మార్కెట్ జరుగుతుంది. ఆ రోజు తమ జీవిత భాగస్వాములతో కలిసి జీవిస్తున్న పలువురు వ్యక్తులు ఖౌ వాయ్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ చాలా కాలం తర్వాత తమ మాజీ ప్రేమికులను కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.
ఈ సంప్రదాయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం భార్యాభర్తల మధ్య ఉన్న నమ్మకం. భర్త తన మాజీ ప్రియురాలిని కలుసుకోవడానికి భార్య అభ్యంతరం చెప్పదు. అదే విధంగా భార్య తన మాజీ ప్రియుడిని కలవాలనుకుంటే భర్త కూడా అంగీకరిస్తాడు. అయితే, ఈ కలయిక ప్రస్తుత వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించడానికి కాదు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితుల మాదిరిగా ఒకరి క్షేమ సమాచారాన్ని మరొకరు తెలుసుకోవడం, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం లాంటివి జరుగుతాయి.
ఖౌ వాయ్ లవ్ మార్కెట్ ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. దీంతో ఈ రోజుకు స్థానికుల జీవితాల్లో ప్రత్యేక స్థానం ఉంది. చాలా కాలంగా ఒకరినొకరు చూడని మాజీ ప్రేమికులు ఈ సందర్భంగా ఒకే చోట చేరుతారు. కొంతమంది తమ జీవితాల్లో జరిగిన మార్పులను చెప్పుకుంటే, మరికొందరు పాత రోజులను గుర్తుచేసుకుంటారు. కొద్దిసేపు మాట్లాడుకుని మళ్లీ తమ తమ జీవితాల్లోకి వెళ్లిపోతారు.
ఈ సంప్రదాయం వెనుక ఓ పాత ప్రేమకథ ఉందని స్థానిక కథనం చెబుతోంది. వేర్వేరు తెగలకు చెందిన ఓ యువకుడు, యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే, వారి కుటుంబాలు, తెగలు ఈ ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ప్రేమను వదులుకోవాల్సి వచ్చినా ఒకరినొకరు పూర్తిగా మర్చిపోలేకపోయారు. భవిష్యత్తులో కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలుసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని చెబుతారు. అలా వారు కలుసుకున్న ప్రదేశమే కాలక్రమంలో ఖౌ వాయ్ లవ్ మార్కెట్‌గా మారిందనే కథనం ప్రచారంలో ఉంది.
Read Also: పై నుంచి చూస్తే దీన్ని అడవి అనుకుంటారు.. కానీ, అది అతి పెద్ద చెట్టు, ఎక్కడుందంటే?