Ghost Bird Mystery: అడవుల్లో కనిపించే కొన్ని పక్షులు వాటి రూపం, ప్రవర్తనతో ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వాటిలో ఘోస్ట్ బర్డ్ కూడా ఒకటి. దీనిని అసలు పేరు పోటూ పక్షి. పేరులోనే భయపెట్టేలా ఉన్న ఈ పక్షి నిజానికి చాలా ప్రత్యేకమైన జీవి. పగటిపూట చూస్తే చెట్టు కొమ్మలో ఒక భాగంలా కనిపిస్తుంది. రాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి ఆహారం కోసం వేటాడుతుంది. అంతేకాదు.. దీని అరుపులు వినేవారికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి.
పోటూ పక్షులు ప్రధానంగా మధ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపిస్తాయి. దట్టమైన అడవులు, చెట్లతో నిండిన ప్రాంతాలే వీటికి ఇష్టమైన నివాసాలు. ఇవి సాధారణంగా పగటిపూట ఎక్కువగా కదలవు. చెట్టు కొమ్మపై కదలకుండా కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి. అందుకే వాటిని గమనించడం అంత ఈజీ కాదు.
ఘోస్ట్ బర్డ్‌లో అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే విషయం దాని మారువేషం. పగటిపూట చెట్టు కొమ్మపై కూర్చున్నప్పుడు దాని శరీరం, ఈకల రంగు చెట్టు బెరడు, విరిగిన కొమ్మను పోలి ఉంటాయి. అంతేకాదు.. కళ్లను కూడా మూసుకుని కదలకుండా ఉండటం వల్ల దాన్ని ప్రత్యేకంగా గుర్తించడం చాలా కష్టం. దగ్గరగా చూసినా అది పక్షి అని గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. పోటూ పక్షి ముఖాన్ని చూస్తే మొదట కనిపించేది దాని పెద్ద పెద్ద కళ్లే. గుడ్లగూబను గుర్తు చేసేలా ఉండే ఈ కళ్లతో రాత్రి సమయంలో పరిసరాలను గమనిస్తుంది. దీని నోరు కూడా చాలా వెడల్పుగా ఉంటుంది. ఒకసారి నోరు తెరిస్తే పక్షి ముఖం మరింత భిన్నంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన రూపమే దీనికి దెయ్యం పక్షి అనే పేరును తెచ్చిపెట్టింది.
పగటంతా నిశ్చలంగా ఉండే పోటూ.. రాత్రి పడగానే చురుగ్గా మారుతుంది. చీకట్లో ఎగురుతూ కీటకాలను వేటాడుతుంది. ఎగిరే పురుగులను పట్టుకోవడంలో దాని విశాలమైన నోరు బాగా ఉపయోగపడుతుంది. వేట ముగించుకున్న తర్వాత మళ్లీ చెట్టు కొమ్మలపైకి చేరుతుంది. ఇలా పగలు దాక్కుని, రాత్రి వేటాడటం దాని జీవన విధానంలో భాగం.
పోటూ పక్షికి మరో ప్రత్యేకత దాని శబ్దం. రాత్రివేళ అడవిలో ఇది చేసే అరుపులు చాలా దూరం వరకు వినిపిస్తాయి. ఆ శబ్దం సాధారణ పక్షుల కిలకిలారావాల్లా కాకుండా.. కొంత భయంకరంగా, వింతగా ఉంటుంది. దట్టమైన అడవిలో ఒక్కసారిగా ఈ అరుపు వినిపిస్తే అక్కడ ఉన్నవారికి భయమేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఘోస్ట్ బర్డ్ అని పిలుస్తుంటారు.
Read Also: 500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?