TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వచ్చే వారం పోలీసులు అనుమతితో ఆయన బాధితులను పరామర్శిస్తారని టీవీకే పార్టీ పేర్కొంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో పర్యటనలను 14 రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడు రోజుల క్రితం కరూర్ విజయ్ ప్రచార సభలో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతిచెందడంతో టీవీకే పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కీలక పోస్ట్ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆత్మీయులను కోల్పోయామని చెప్పింది. బాధ, దుఖం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార సభలను రెండు వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రచార సభలకు సంబంధించిన కొత్త డేట్ లను, షెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. పార్టీ అధినేత ఆమోదంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు ట్విట్టర్ లో టీవీకే పార్టీ పోస్ట్ చేసింది.
ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి మథియాళన్, సౌత్ సిటీ కోశాధికారి పౌన్ రాజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారి ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిన్న టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. వీడియోలో మాట్లాడుతూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరూర్ తొక్కిసలాట ఘటన తనను ఎంతోగానూ కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు.. ఎంతో ప్రేమతో తన నిర్వహించిన మీటింగ్ కు ప్రజలు భారీ గా వచ్చారని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పిస్తానని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే నిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఏ తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని అన్నారు. కావాలంటే సీఎం స్టాలిన్ తనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!
ఇలాంటి ఘటన కరూర్ లోనే ఎందుకు జరిగింది..? అనేది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఎలా జరిగిందో అసలు తెలియడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగిందని పేర్కొన్నారు. తాను ఇప్పుడు మరింత బలంగా బయటకు వస్తానని తెలిపారు.